Thursday 9 October 2014

పవర్‌ హాలీడేలిస్తే పరిశ్రమలెలా వస్తాయి?

          

         
        రోజుకు నాలుగు గంటల విద్యుత్‌ కోతలు, వారంలో రెండు రోజులు పరిశ్రమలకు పవర్‌ హలీడే ఇస్తే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇలాగైతే హైదరాబాద్‌ విశ్వనగరంగా తీర్చిదిద్దడం అసాధ్యమని, ఇలాంటి విద్యుత్‌ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ఎలా పరిశ్రమలు స్థాపిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే తెలంగాణ నుంచి అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయాయన్నారు. రాష్ట్రంలో పవర్‌ హాలీడే వల్ల ఆర్థిక వ్యవస్థ తలకిందులవుతుందని, కాబట్టి రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యను పరిష్కరించేందుకు నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సిపిఎం గ్రేటర్‌ హైదరాబాద్‌ నార్త్‌ జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశాన్ని భోలక్‌పూర్‌లోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు హరిప్రసాద్‌ అధ్యక్షతన బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా తమ్మినేని వీరభద్రం హాజరై మాట్లాడారు. ఎన్నికల సందర్భంలో కెసిఆర్‌ ఇచ్చిన అనేక హామీలు అమలుకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. భూమి లేని దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ప్రకటించారని, కానీ రాష్ట్రంలో భూమి లేదని ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్‌ఆర్‌ఐలనుంచి భూమి కొనుగోలు చేసి పంచుతామని చెబుతుందని, ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారనే విషయం మాత్రం ప్రకటించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అప్పులబాధతో ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయనీ, కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా ఆకలి చావులు కూడా మళ్లీ మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, టిడిపి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలే టిఆర్‌ఎస్‌ అనుసరిస్తోందని విమర్శించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చరిత్రను వక్రీకరించే పనిలో పడిందని, దీనికోసం ప్రత్యేకంగా సుదర్శన్‌రావు అనే మతతత్వ వాదిని నియమించిందన్నారు. దేశంలో మతతత్వ ఘర్షణలు పెంచేందుకు మోడీ కుట్ర పన్నుతున్నారని, మత సామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. 

Tuesday 7 October 2014

ఆకలి చావులు సంభవించడం ఘోరం : సిపిఎం


             నిజామాబాద్‌ జిల్లా నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన టేకుమాల దుర్గయ్య (55) ఆకలి చావుకు గురికావడం అత్యంత ఘోరమని, విషాదకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దుర్గయ్యకు అంత్యోదయ అన్నయోజన పథకం కింద వచ్చే 35 కిలోల బియ్యాన్ని నిలిపేయడంతో తిండిగింజలు కరువై పస్తులున్నాడని తెలిపారు. నెలరోజులుగా గ్రామస్తులు ఎవరైనా తిండిపెడితే తింటున్నాడని, లేనిరోజు పస్తులున్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆకలిని భరించలేక ఈనెల 6న సాయంత్రం అతను నివాసముంటున్న గుడిసె వద్ద ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడని తెలిపారు. అంత్యోదయ అన్నయోజన కార్డు రద్దు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందే సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం వాంఛనీయం కాదని తెలిపారు. కనీసం కేంద్రం ఇస్తున్న సబ్సిడీనైనా ప్రజలు పొందేలా ప్రభుత్వం తగు నియమనిబంధనలు రూపొందించి అమలు చేయాలని సూచించారు.

పుస్తకాలుకాల్చేస్తే చరిత్ర మారుతుందా?

            
            మార్క్సిస్టులు, పాశ్చాత్యలు, ముస్లింలు రచించిన చరిత్ర పుస్తకాలను తగులబెట్టండని. బిజెపి సీనియర్‌నేత, మాజీ కేంద్ర మంత్రి సుబ్రమాణ్యస్వామి పిలుపునివ్వటం దారుణం. ఫైళ్ళ ప్రక్షాళన పేరుతో, ఇప్పటీకే ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాల మేరకు, హోంమంత్రిత్వ శాఖ దాదాపు లక్షన్నర ఫైళ్ళను ధ్వంసం చేసింది. వాటిలో కొన్ని చారిత్రక క్షణాలకు సంబంధించిన సమాచారం వుందనీ వార్తలు వెలువడ్డాయి. మహాత్మాగాంధీ హత్య వార్తను ప్రకటించడానికి ముందు జరిగిన కేబినెట్‌ సమావేశం వివరాలున్నఫైళ్ళు కూడా ధ్వంసం చేసారన్న ఆరోపణలకు స్పష్టమైన సమాధానం లేదు. నిత్యం మహాత్మాగాంధీతో పోల్చుకొని మహాత్మునిలా స్వచ్ఛ భారత్‌ నిర్మాణం జరగాలని ప్రగల్బాలు పలికే మన ప్రధాని, గాంధీ చరిత్రను ధ్వంసం చేయాలని చూస్తున్నారు. మహాత్మాగాంధీని హత్యచేసిన తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలన్న నిర్ణయం తీసుకున్నది, ఆనాటి హోం మరియు డిప్యూటీ ప్రధాని అయిన సర్దార్‌ పటేల్‌. ఈ విషయం అప్పటి కెబినెట్‌ సమావేశాల రికార్డుల ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకు తెల్సిన సమాచారం ప్రకారం ఆ రికార్డులను మాయం చేశారు. పటేల్‌కు అన్ని ప్రాంతాలనుండి ఇనుప ముక్కలు తీసుకెళ్ళి పెద్ద విగ్రహం కట్టించాలనుకుంటున్నారు. కాని ఆయన తీసుకున్న నిర్ణయాలను విగ్రహం క్రిందపాతరేసి చరిత్రను తిరగ రాయలనుకుంటున్నట్లు కన బడుతున్నది. 
                         బిజెపి ఎప్పుడు ఆధికారంలోకి వచ్చినా చరిత్ర రచనతో చెలగా టం మొదలవుతుంది. జనతా పార్టీలో భాగస్వామిగా 1977లో మంత్రి వర్గంలో చేెరినప్పుడు కూడా మొదట చేసిన పని చరిత్ర రచనపై దాడి. రొమిల్లా థాపర్‌ వంటి అగ్రశేణి చరిత్ర పరిశోధకులు రాసిన పాఠ్య పుస్తకాలను ఉపసంహరించటం మొదలుపెట్టారు. దానిపై పెద్ద దుమారం చెలరేగింది. అయితేనేెం వారి ధోరణి మారలేదు. మళ్ళీ 1998 వాజ్‌పేయి నాయకత్వంలోని బిజెపి, ఎన్‌డిఎ పాలనలో ఇదే పునరావృ తమైంది. బిజెపి ఆధికాంలో వున్న రాష్ట్రాలలో స్కూల్‌ పుస్తకాలు లౌకిక విలువలకు విరుద్ధంగా, తమ రాజకీయ ప్రయోజ నాలకను కూలంగా మార్పు చేసుకున్నారు. ఈ సారి పూర్తి మెజారిటీితో ప్రధాని స్థానంలో వున్నారు గనుక, దాడి తీవ్రత ఎక్కువగానే పెరుగుతుంది. ఐసిహెచ్‌ఆర్‌, అంటే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రీసెర్చ్‌, ఛైర్మన్‌గా మోడీ సర్కారు ఎల్లాప్రగడ సుదర్శనరావును నియమించుకున్నది. ఈయనను ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులైౖన మేధావులే అంగీకరించలేదు. ఆయన భారతదేశ చరిత్ర, శాస్త్రీయ పరిశోధనకు భిన్నంగా, రామాయణ భారతాలతో మొదలవుతుంది. రోత పుట్టించే కుల వ్యవస్థ వల్ల దేశానికి మేలు జరుగుతుందంటారు. కాలంచెల్లిన ఈ దురభిప్రాయాలను పట్టుకువేళ్ళాడే వారిని చరిత్ర పీఠాధిపతిని చేయడం కన్నా దౌర్భాగ్యం ఏముంటుంది?
                     ప్రతిదేశం, ప్రతిజాతి తమ గతాన్ని గొప్పగానే భావిస్తాయి అయితే అందులో మంచి చెడులను నిరావేశంగా బేరీజువే సుకోవాలి. ఇప్పటి రాజకీయ అవసరాలనుబట్టి లేక మత విశ్వాసాలను బట్టి గతాన్ని చిత్రిస్తామంటేె అనర్థమే మిగులు తుంది. ఇప్పుడు హిందూ ముస్లిం తగాదాలను రగిలించడమేగాక గతాన్ని కూడా ఆతరహలోనే విభజించాలని చూడటం వినాశ కరం. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధినేత మోహన్‌ భగవత్‌ దసరా ప్రసంగాన్ని గంటసేపు ప్రత్యక్ష ప్రసారం చేయటం కనీవినీ ఎరుగని వైపరీత్యం. ఆర్‌ఎస్‌ఎస్‌ మత ప్రాతిపదికపై జనాన్ని చీల్చి మెజారిటీ మతతత్వ విషాన్ని ఎక్కించజూసే ఒక ఫాసిస్టు సంస్థ. దానికి అధినేతగా ఉన్న వ్వక్తి ప్రసంగాన్ని ప్రజాధనంతో నడిచే దూరదర్శన్‌ ప్రత్యక్షప్రసారం చేయడమంటే వివిధ మతాలకు, భాషలకు నెలవైన ఈ దేశాన్ని ఇక్కడి ప్రజలను అవమానించడమే అవుతుంది. అంతేకాదు, గాంధీని హత్యచేసిన వ్యక్తి మాతృసంస్థ ఆరెస్సెస్‌, సరిగ్గా గాంధీ జయంతి తెల్లారే, ఆ సంస్థ అధినేత దూరదర్శన్‌ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం చేయటం ప్రమాదఘంటికలకు చిహ్నం.
                    యుపిఎ ప్రభుత్వం ఆయా వ్యవస్థలను సంస్థలను భ్రష్టుపట్టించిందంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర విమర్శలు చేసింది. బిజెపి ఇప్పుడు ప్రసారభారతికి స్వతంత్ర ప్రతిపత్తిని కాలరాస్తూ, కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖే భగవత్‌ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయవల్సిందిగా ఆదేశించింది.యుపిఎ ప్రభుత్వాన్ని సోనియా తన రిమోట్‌ కంట్రోల్‌తో నడిపిస్తుందని ఆరోపించిన బిజెపి, ఎన్‌డిఎ హయాంలో పార్టీని, ప్రభుత్వాలను రెండింటిని ఆర్‌ఎస్‌ఎస్‌ అనే రాజ్యాంగేతర శక్తి రిమోట్‌ కంట్రోల్‌తో నడిపిస్తుంది. ఈ వైఖరి రానున్న రోజులలో మరింత విశృంఖల రూపం తీసుకుంటుందన్నది నిస్సందేహం.
(ప్రజాశక్తి సంపాదకీయం 07102014)




విద్యుత్ కొరత నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి


- ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోవడం సరికాదు 
- సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ 

             రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ కొరతను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. గతంలో అనేకసార్లు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలిపింది. ఫలితంగా పెద్దఎత్తున నష్టం వాటిల్లిందని పేర్కొంది. ప్రతిపక్షాలు ఈ సమస్యను రాజకీయం చేస్తున్నాయని ప్రకటించి ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోవడం సరైంది కాదని తెలిపింది. ప్రతిపక్షాలిచ్చే సలహాలనూ పరిగణనలోకి తీసుకొని సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 
                   నిజామాబాద్‌ జిల్లా లింగంపేట మండలం జల్దిపల్లి గ్రామానికి చెందిన తెగుళ్ల హనుమంతు, హన్మయ్యతోపాటు మరో 50 మంది  రైతులు బావుల కింద సేద్యం చేసిన తమ వరి పైర్లు ఎండిపోవడంతో వాటికి నిప్పుపెట్టారని తెలిపారు. కౌలురైతు ముంబై స్వామి పురుగుల మందు తాగేందుకు పొలంలోనే ప్రయత్నించాడని పేర్కొన్నారు. కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోని మండలాల రైతులు రోడ్ల మీదకు వచ్చి కరెంటు కోతలు తీర్చాలని ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. రాంపూర్‌ గ్రామ (నిజామాబాద్‌) పరిధిలోని 100 కెవి ట్రాన్స్‌ఫార్మర్‌ తొమ్మిదిసార్లు కాలిపోయిందని పేర్కొన్నారు. విద్యుత్‌ కోతలతో బావుల కింద వేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా ఆందోళనలకు దిగడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. 
                 పంట చేతికి వస్తున్న దశలో విధిస్తున్న కోతలతో రైతులు తల్లడిల్లుతున్నారని తెలిపారు. కనీసం పంటలను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని, విద్యుత్‌ కొనుగోలు చేసైనా పంటను రక్షించాలని, ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేశామని పేర్కొన్నారు. పరిశ్రమలకు వారంలో ఒక రోజు విద్యుత్‌ సెలవు ప్రకటించారని తెలిపారు. మరోరోజు ప్రకటించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. విద్యుత్‌ సెలవు ప్రకటనతో పరిశ్రమలు పూర్తిగా తమ ఉత్పత్తిని కొనసాగించలేకపోతున్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేక కొందరు పరిశ్రమలు మూసివేస్తున్నారని, మరికొందరు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. ఉత్పత్తి, ఉపాధిపై వీరి ప్రభావం తీవ్రంగా ఉంటోందని తెలిపారు. చివరకు ప్రభుత్వ కార్యాలయాలూ పనిచేయలేని పరిస్థితి వస్తోందని పేర్కొన్నారు. ప్రమాదం మరింత ముంచుకురాకముందే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 
                 వారంరోజులుగా దక్షిణాది గ్రిడ్‌ నుంచి యూనిట్‌కు రూ.8.50 చొప్పున రోజు 14 నుంచి 15 మిలియన్‌ యూనిట్లు కొనుగోలు చేస్తున్నామని విద్యుత్‌ శాఖ చెప్తున్నా పరిస్థితుల్లో ఏ మార్పూ లేదని తెలిపారు. గ్రామాల్లో 10 నుంచి 12 గంటలు విద్యుత్‌ సక్రమంగా రావడం లేదని పేర్కొన్నారు. ఎంత ఖర్చయినా విద్యుత్‌ కొనుగోలు చేస్తామని చెప్తున్న సిఎం అధికారానికి వచ్చి నాలుగు మాసాలైనా నేటికీ రోజుకు 25 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరత కొనసాగుతూనే ఉందని తెలిపారు. రబీ సీజన్‌లో ఏ పంటలు వేయాలో ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికతో కాంటింజెన్సీ పథకాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. వ్యవసాయ, విద్యుత్‌ శాఖలను సమన్వయం చేసి రబీ పంటల దిగుబడిని పెంచడానికి, ఖరీఫ్‌లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నించాలని కోరారు. ఖాళీగా ఉన్న లైన్‌మెన్‌ పోస్టులను భర్తీ చేసి అన్ని పంపుసెట్లకూ కెపాసిటర్లు బిగించడం ద్వారా కొంత నష్టాన్ని అధిగమించవచ్చని అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తెచ్చామని తెలిపారు. ఖరీఫ్‌లో బావుల కింద పంటలు వేసి నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పరిశ్రమల్లో ఉపాధి కోల్పోకుండా విద్యుత్‌ సరఫరాను మెరుగుపర్చాలని సూచించారు.

Monday 6 October 2014

డీజిల్‌ ధరలను తగ్గించండి : సిపిఎం డిమాండ్

 న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ డీజిల్‌ ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం, చమురు మార్కెటింగ్‌ కంపెనీలు (ఓఎంసిలు) తిరస్కరించడాన్ని సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ముడి చమురు ధర బ్యారెల్‌కు 92 డాలర్లు తగ్గింది. 27మాసాల కాలంలో ఇదే అత్యంత కనిష్ట ధర. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క లీటరు డీజిల్‌పై విక్రయానికి రు.1.90 మొత్తాన్ని చమురు మార్కెటింగ్‌ కంపెనీలు సంపాదిస్తున్నాయని తెలుస్తోంది. ఇది 'అధిక రికవరీ' అని సిపిఎం పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. 2013 జనవరి నుండి ప్రతి నెల లీటరుకు 50పైసలు చొప్పున పెంచాలని ప్రభుత్వం చమురు మార్కెటింగ్‌ కంపెనీలను ఆదేశించింది. ఆనాడు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతూ వస్తున్న ముడి చమురు ధరలను దృష్టిలో పెట్టుకుని యుపిఎ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ మోడీ సర్కార్‌ డీజిల్‌ ధరలను తగ్గించకుండా ఆనాటి విధానాన్నే అనుసరిస్తోందని సిపిఎం విమర్శించింది. ఈ రకమైన నిష్క్రియాపరత్వం వల్ల ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోంది. ముఖ్యంగా రైతులపై, చిన్న తరహా పరిశ్రమలపై, వస్తువుల రవాణా రంగంపై భారం పడుతోందని సిపిఎం విమర్శించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెద్ద ఎత్తున తగ్గిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తక్షణమే డీజిల్‌ ధరలను తగ్గించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది.

మళ్లీ 108 పరుగులు...


108పై స్పందించిన ముఖ్యమంత్రి 

               108పై 'ఆపదలో అపర సంజీవిని` పేరుతో వచ్చిన కథనానికి, సోషల్ మీడియాలో కూడా ప్రచారం తోడవ్వడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పందించారు. వాహనాలు నిలిచిపోవడంతో ప్రభుత్వం యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, జివికె సంస్థ సిఇఓ విద్యాసాగర్‌, కో ఆర్డినేటర్‌ సుశీలా, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం డైరెక్టర్‌ డాక్టర్‌ కల్పన, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కిషోర్‌లను తన ఛాంబర్‌కు పిలిపించుకుని 108 వాహనాలను వెంటనే పునరుద్దరించాల్సిందిగా ఆదేశించారు. 108 వాహనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి హెచ్చరికతో ఆఘమేఘాల మీద 108 వాహనాలపై మంత్రి, ఉన్నతాధికారులు ఆరా తీశారు. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం హామీ ఇవ్వడంతో జివికె సంస్థ కొన్ని గంటల్లోనే అపర సంజీవిని రోడ్డెక్కించింది. కాగా 108 వాహనాలు నిలిచిపోవడంపై జివికె సంస్థ ప్రతినిధులపై ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయకపోవడం వల్లే జివికెకు బకాయిలు పేరుకుపోయాయని వారు మంత్రికి వివరణనిచ్చారు. కాగా మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో చెల్లించాల్సిన బకాయిలకు ప్రత్యేక జిఒ తేవాల్సి ఉందని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రతినెల బకాయిలు చెల్లిస్తోందని మంత్రి వివరించారు.

ఉపాధ్యాయుల కొరత తీర్చాల్సింది పోయి... ఉన్నవారిపై కెసిఆర్ బెదిరింపులు

          పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను టిఆర్ఎస్ సర్కార్ పూరించడం లేదు. రేషనలైజేషన్ పేరుతో కావాలనే జాప్యం చేస్తోంది. అరకొర సౌకర్యాలతో, ఉన్న పాఠశాలలను నెట్టుకొస్తున్న టీచర్లను స్వయాన కెసిఆర్ బెదిరించడం దుర్మార్గం.
     `విద్యార్థులు లేకున్నా, పని చేయకున్నా ఎంత టీచర్లయినా కూసుండబెట్టి జీతాలియ్యాలా?` ఇదీ కెసిఆర్ మాట.
     ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎందుకు లేరు? ఎందుకు రావడం లేదు? టీచర్లు పని చేయకపోతే సర్వీసు రూల్సు ప్రకారం యాక్షన్ ఎలాగూ ఉంటుంది కదా? కూసోబెట్టి జీతాలు ఇవ్వడం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కెసిఆర్ కు తెలియవని అనుకోవాలా?

      టీచర్లపై బెదిరింపులకు దిగే ముందు ఈ కింది సమస్యలను పరిష్కరిస్తే  మంచిది.
  1. తెలంగాణా రాష్ట్రంలో ఉపాధ్యాయులకు తక్షణం సర్వీసు రూల్సు రూపొందించి అమలు చేయాలి.
  2. ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరు, ముగ్గురు టీచర్లతో తరగతులు కొనసాగుతున్నాయి. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేరు. భాషా పండితులు లేరు. తక్షణమే తాత్కాలిక ఉపాధ్యాయులను, అకాడమిక్ ఇన్స్ ట్రక్టర్లను నియమించాలి.
  3. కొత్త పుస్తకాలు, పరీక్షల విధానంపై టీచర్లకు అవగాహన కల్పించాలి. వెంటనే మారిన పాఠ్య పుస్తకాలపై శిక్షణ ఏర్పాటు చేయాలి.
  4. పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల సమస్య త్రీవంగా ఉంది. పరిష్కరించాలి.
  5. హై స్కూళ్లోని పండిట్, పిఇటి పోస్టున్నింటినీ అప్ గ్రేడ్ చేసి ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేయాలి.
  6. పాఠశాలల్లో స్వీపర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మంజూరు చేయాలి. ఉన్నత పాఠశాలలకు జూనియర్ అసిస్టెంట్, రాత్రి పూట కాపలదారు పోస్టులను మంజూరు చేయాలి.
  7. ఆర్ వి ఎం, ఆర్ఎంఎస్ఎ గ్రాంట్లను పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మంజూరు  చేయాలి.
  8. కంప్యూటర్, ఆర్ట్, పని విద్యకు రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలి.
పై ఎనిమిది సమస్యలను పరిష్కరిస్తే పాఠశాలలు విద్యా బోధనకు వీలుగా ఉంటాయి. విద్యార్థుల సంఖ్య పడిపోదు.
  1. 10వ పిఆర్సిని వెంటనే అమలు చేయాలి. హెల్త్ కార్డ్స్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి.
  2. స్పెషల్ టీచర్ సర్వీసుకు నేషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి.
  3. ఎంఇఓ, డిప్యూటి ఇఓ, డైట్ లెక్చరర్ ఖౄళీలను అడ్హక్ రూల్సులలో పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి.
  4. రిటైర్మెంట్ సందర్భంగా అర్థజీతపు సెలవు అమ్ముకునే సౌకర్యం కల్పించాలి.
  5. ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించాలి. 
  6. అప్ గ్రేడ్ పండిట్లకు నష్టం కలిగించిన యాక్ట్ 1-2005ను ప్రాస్పెక్టివ్ గా అమలు చేయాలి.
  7. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు నష్టం కలిగించే యాక్ట్ 37-2005ను ప్రాస్పెక్టివ్ గా అమలు చేయాలి.
పై ఏడు సమస్యలను పరిష్కరిస్తే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ టీచర్లు భావి భారత పౌరులను తీర్చిదిద్దే పనుల్లో ఉంటారు.