- రోడ్డుషోల్లో తమ్మినేని
ప్రజాశక్తి- వరంగల్ ప్రతినిధి/ ఉప్పల్
తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక విధివిధానాలు అవసరమని, ఆ దిశగా పనిచేసే వారికి ఓట్లు వేయాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రజలకు పిలుపునిచ్చారు. అవినీతి కాంగ్రెస్‌ను, మతోన్మాద బిజెపిలను ఓడించాలని కోరారు. సిపిఎం, ఆ పార్టీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో రోడ్ షో, బహిరంగ సభల్లో ఆదివారం పాల్గొన్నారు.
ఉప్పల్, మల్కాజిగిరి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎస్ నర్సింహారెడ్డి, డిజి నర్సింహారావు, మెట్టు శ్రీనివాస్, మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానం స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్సీ నాగేశ్వర్ విజయాన్ని కాంక్షిస్తూ రోడ్డు షోల్లో ఆయన మాట్లాడుతూ ధనబలం, కండబలంతో దిగుతున్న వారిని ఓడించాలని, పేదల కోసం పనిచేసేవారిని గెలిపించాలని కోరారు. నీతివంతమైన పాలన సిపిఎంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. తెలంగాణలో 40 లక్షల దళిత కుటుంబాలున్నాయని, వారి అభివృద్ధి గురించి ఆలోచించని నాయకులను ముఖ్యమంత్రిగా చేస్తే ఫలితం ఉంటుందా అని ప్రశ్నించారు. దళితులకు 16వేల కోట్లు, గిరిజనులకు 8వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించాల్సిన అవసరముందన్నారు. సిపిఎంకు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ సాధించగలిగారని గుర్తు చేశారు. ప్రజా క్షేమం గురించి ఆలోచించే తత్వం వామపక్ష పార్టీలకే ఉంటుందన్నారు. హైదరాబాద్ జిల్లా అభివృద్ధి గురించి ఊకదంపుడు ప్రచారాలు ఆపి అసలు ఆ జిల్లాలోని మండల కేంద్రాల్లో ప్రభుత్వ కళాశాలు, ఆస్పత్రులు ఎందుకు నిర్మించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మురికివాడల ప్రజల ఇబ్బందులు నేతలు పట్టవా అని ప్రశ్నించారు. సంస్కరణల పేరుతో బిజెపి, కాంగ్రెస్‌లు ప్రజలను మోసం చేస్తున్నాయని, అభివృద్ధి అంటే పేదల పొట్ట గొట్టడమేనా అని ప్రశ్నించారు. సారయ్య మంత్రి పదవి చేపట్టినా వరంగల్ జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు. జిల్లాలో ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయించలేకపోయారని విమర్శించారు. వరంగల్ రోడ్‌షోలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి నాగయ్య, నాయకులు నలిగంటి రత్నమాల, కొప్పుల శ్రీనివాస్, దుబ్బ శ్రీనివాస్, రమణ, గడ్డం రమేష్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment