Tammineni Veerabhadram |
వరంగల్: నరేంద్ర మోడీ ప్రధానైతే దేశాన్ని రావణకాష్టం చేస్తాడని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖిల్లా వరంగల్ లో ఆదివారం ఆ పార్టీ నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. గుజరాత్ లో మూడు వేల మంది ముస్లీం మైనారిటీలను మోడీ ఊచకోత కోశారని విమర్శించారు. కులాలు, మతాల మధ్య కోట్లాటలు పెట్టి గుజరాత్ ను రావణ కాష్టంగా మార్చాడని తెలిపారు. మతోన్మాద మోడీని ప్రధానిని చేయడం తప్పు అని పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఓట్ల కోసం రామమందిర నిర్మాణం పేరుతో హిందువులను రెచ్చగొడుతున్నారన్నారు. బీజేపీ మతోన్మాద వైఖరిని వ్యతిరేకించాలని సూచించారు. మతాల మధ్య చిచ్చుపెట్టడం దేశానికి నష్టదాయకమన్నారు. మోడీని సమర్థిస్తేనే దేశంలో ఉండాలా లేకపోతే పాకిస్తాన్ వెళ్లాలా అని ప్రశ్నించారు. భారతదేశంలో అనేక రకాల మతాలకు చెందిన వారు ఐక్యమత్యంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. మతాల మద్య చిచ్చుపెడితే దేశం కుక్కలు చింపిన విస్తరాకు అవుతుందన్నారు. అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు రేషన్ కార్డులను తగ్గిస్తున్నాయని, సంక్షేమ పథకాలను తొలగిస్తున్నారని చెప్పారు. నిత్యవసరాల ధరలను పెంచి ప్రజలపై అధిక భారాలను మోపుతున్నాయని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం భూములను కట్టబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 లక్షల కోట్ల రూపాయలను ధనవంతులకు సహాయం చేసిందని మండిపడ్డారు. సిపిఎం ప్రజల పక్షాన పోరాడి పేదలకు గుడిసెలు వేయించిందని గుర్తు చేశారు. నీడనిచ్చిన ఎర్రజెండాను మరిచిపోద్దవని సూచించారు. లౌకికవాద శక్తులను, ప్రజల తరపున పోరాడే వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment