రైతు జాతాలు, బహిరంగ సభ పోస్టర్ విడుదల చేస్తున్న పది వామపక్ష పార్టీల నాయకులు |
* రైతులకు భరోసా కల్పించడంలో ఘోర వైఫల్యం
* ఆత్మహత్యలు నివారించండి ఆర్థిక భద్రత కల్పించండి
* 10 వామపక్ష, కమ్యూనిస్టు పార్టీల డిమాండ్
* 5 నుంచి 10 వరకు జిల్లాల జాతాలు
* 11న చలో హైదరాబాద్
రాష్ట్రంలో రోజుకు 6 నుండి 9 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పది వామపక్ష, కమ్యూనిస్టు పార్టీలు ఆందోళన వ్యక్తంచేశాయి. 2014, జూన్ 2 నుండి నవంబర్ 28 వరకు రాష్ట్రంలో 565 మంది రైతులు ఆత్మ హత్యలకు పాల్పడ్డారని తెలిపాయి. అవన్నీ సర్కా రీ హత్యలేనని ప్రకటించాయి.
రైతులకు భరోసా కల్పించడంలో, ఆదుకోవడంలో, విశ్వాసం నింపడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించాయి. రైతు ఆత్మహత్యలను నివారించాలని, రైతంగ ఆర్థిక భద్రతను కల్పించాలని డిమాండ్ చేశాయి. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈనెల 5 నుంచి 10 వరకు జరపనున్న జిల్లాల జాతాలకు సంబంధించిన పోస్టర్‌ను పది వామపక్ష, కమ్యూనిస్టు పార్టీల నేతలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 565 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని భావిస్తే బడ్జెట్‌లో నిధులు కేటాయించేదని అన్నారు. కానీ ఈ బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తెలిపారు. 70 నుంచి 80 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ప్రభుత్వం చెప్తోందని, దానిని గుర్తించినా కొంత డబ్బు కేటాయించేదని చెప్పారు. రైతు ఆత్మ హత్యలను ప్రభుత్వం గుర్తించలేదని స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. అవి ప్రభుత్వ హత్యలే తప్ప మరొకటి కాదని వివరించారు. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రైవేటు రుణాలపై రెండేళ్లపాటు మారటోరియం ప్రకటించాలని కోరారు. సన్న,చిన్న కారు రైతులకు అవసరమైన రుణాలు ఇవ్వాలని, విత్తనాలు, పురుగుమందులు సరఫరా చేయాలని సూచించారు. రైతు సమస్యలపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్షం పిలవాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలు నివారించేందుకు అవసరమైన సహాయ చర్యలపై దృష్టి సారించాలని కోరారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ పది వామపక్ష, కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 5 నుండి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ''రైతుల ఆత్మహత్యల నివారణ జాతాలు'' చేపడుతున్నామని వివరించారు. రెండు టీంలుగా ఏర్పడి పది జిల్లాల్లోనూ ఈ జాతా పర్యటిస్తుందని తెలిపారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి కారణాలు, సాధకబాధకాలు తెలుసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై లోతైన అధ్యయనం చేస్తామన్నారు. రైతు ఆత్మహత్యల విషయంలో దేశంలోనే తెలంగాణ రెండోస్థానంలో ఉందన్నారు. కొత్త రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల్లో విశ్వాసం కల్పించడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. నినాదాలు ఎన్ని చెప్పినా విధివిధానాల అస్పష్టత కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. ఈనెల 11న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు.
సిపిఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) నేత వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ టిఆర్‌ఎస్ కూడా అనేక వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ నేడు రైతుల్లో భరోసా కల్పించడంలో విఫలమైందని చెప్పారు. గత ప్రభుత్వాలపై నెపం నెట్టి తప్పించుకోజూస్తోందని తెలిపారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని ప్రభుత్వ మెడలు వంచి హక్కులు సాధించుకుందామని అన్నారు.
ఫార్వర్డ్ బ్లాక్, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శులు బి సురేందర్‌రెడ్డి, జానకి రాములు, సిపిఐఎంఎల్ నేత భూతం వీరయ్య, ఎంసిపిఐయు నేత తాండ్రకుమార్, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ నేత ఎన్ మూర్తి మాట్లాడుతూ కెసిఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిర్దిష్ట కాలపరిమితిలోగా ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వారి పిల్లలకు ఉచిత విద్య అందించాలని సూచించారు.
షెడ్యూల్ కోసం ఈ లింకును క్లిక్ చేయండి... Post by CPIM Telangana.
బహిరంగ సభ పోస్టర్ వివరాల కోసం ఈ లింకును క్లిక్ చేయండి. Post by CPIM Telangana.
బహిరంగ సభ పోస్టర్ వివరాల కోసం ఈ లింకును క్లిక్ చేయండి. Post by CPIM Telangana.
No comments:
Post a Comment