Monday, 1 December 2014

టి.సర్కార్ ఆరు నెలల పాలన... ప్రోగ్రెస్ రిపోర్ట్


6 నెలలు..150 నిర్ణయాలు

-  కొన్ని అమలులోకి.. మరికొన్ని ప్రారంభదశల్లో..
-  ఇంకొన్ని కాగితాల్లో
-  కెసిఆర్‌ అర్థసంవత్సర పాలన 
- అమలుకు రెండు నెలల సమయం మాత్రమే 
                తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి సోమవారంతో ఆరునెలలైంది. ఈ సంవత్సరం జూన్‌ రెండున ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ ప్రమాణం స్వీకారం చేసి, ప్రభుత్వ పగ్గాలు అందుకున్నారు. ఆనాటి నుండి ఈ నెల ఒకటి వరకు ఆయన 150 నిర్ణయాలు తీసుకున్నారు. ఆరునెలల పాలనకు సంబంధించి కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయాలను బుక్‌లెట్‌ రూపంలో ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు అందించింది. వందరోజుల పాలన పూర్తి చేసే నాటికి 101 నిర్ణయాలు తీసుకుంటే, ఆరునెలల కాలానికి ఆ సంఖ్య 156కు చేరింది.
         కెసిఆర్‌ అర్థసంవత్సర పాలనలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అందులో పూర్తిగా అమలులోకి వచ్చింది కొన్ని మాత్రమే. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ప్రారంభదశల్లోనూ, ఆరంభశూరత్యంగా నిలిచాయి. ఇంకొన్ని కాగితాల్లో మూలుగుతున్నాయి. 
           లక్ష రూపాయల పంట రుణమాఫీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, అమలు చేసినా ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 17 వేల కోట్ల రుణమాఫీకి గాను మొదట విడతగా 4250 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. గతంలో వర్షాలకు పంటలకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ కింద 480 కోట్లను విడుదల చేసింది. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ ఆరంభశూరత్యంగానే నిలిచింది. మొదట విడతగా మూడువేల మందికి భూ పంపిణీ చేస్తామని ప్రకటించి, చివరికి 500 మందితో సరిపుచ్చారు. వారికి భూములు చూపించేపనిలోనే అధికారులు ఉన్నారు. మిగతా వారికి ఎప్పుడంటే..ఇదొక నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం పేర్కొనడం విశేషం. 
        కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని రాష్ట్రమంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నా, వారిని ఎప్పటోగా చేస్తారన్నదానికి గడువు విధించలేదు. అమరవీరుల కుటుంబాలకు ఆర్థికసాయం, ఉద్యోమకారులపై కేసుల ఎత్తివేత పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్‌ అందజేస్తామని చెప్పి కొంతమందికి ఇవ్వడం పట్ల రానివారంతా మండిపడుతున్నారు. అందరికీ వర్తింపచేయాలని కోరుతున్నారు. సెంట్రల్‌ స్కేల్‌ ఇస్తామని ప్రకటన కేవలం మాటలకే పరిమితమైంది. పిఆర్‌సి అమలు చేసిన తర్వాతే సెంట్రల్‌ స్కీమ్‌ను వర్తింపజేయాలని ఉద్యోగసంఘాలు కోరడంతో దాని సంగతినే ప్రభుత్వం మరిచిపోయింది. 
       మహిళా భద్రతకు ఎన్నో కార్యక్రమాలు రూపొందించినా వారిపై లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. సింగిల్‌ విండో పారిశ్రామిక విధానాన్ని అమలు చేసినా అందులో కార్మికవర్గ రక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామనేది చెప్పలేదు. వక్ప్‌భూముల రక్షణకు వక్ప్‌ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, వాటిపై సభాసంఘం వేస్తామని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాల నినాదం అమలుకు నోచలేదు. ఎస్టీలకు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ మాటలకే పరిమితమైంది. కళ్యాణలక్ష్మి, ముబారక్‌ పథకాలు పెట్టినా ఆ పథకాల ద్వారా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారన్నది బయటకు చెప్పడం లేదు.
       పెన్షన్ల పెంపు, విద్యార్థులకు ఫాస్ట్‌, ఆహారభద్రత కార్డుల పంపిణీపై ఇంకా గందరగోళంగానే ఉంది. వాటికి ప్రభుత్వం భారీగానే ఖర్చు చేస్తున్నా ఈ మూడునెలల కాలంఓ ఆ డబ్బునంతా ఖర్చు చేస్తుందా అన్నది అనుమానాస్పదమే. క్రీడల బలోపేతానికి గాకుండా పథకాలు సాధించినవారికి నగదు ప్రోత్సాహం ఇవ్వడానికి మొగ్గు చూపింది.
        హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు కూడా ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంది. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఆకాశ్‌ హర్మాలు, హైదరాబాద్‌ నాలుగు దిక్కుల ఎక్స్‌ప్రెస్‌ హైవేలు  గ్రీన్‌ హౌజ్‌ కల్టివేషన్‌, ఫామ్‌ మెకనైజేషన్‌ ఇలాంటి పథకాలపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యకమవుతున్నాయి. ఉద్యోగులకు హెల్త్‌కార్డుల పంపిణీ చేసింది. అయితే చంద్రబాబుతో చర్చలనూ, కేంద్రంతో సత్సంబంధాలు, ప్రతిష్టాత్మకంగా మెట్రో సదస్సు, తరలివస్తున్న పరిశ్రమలు, మాసాయిపేట దుర్ఘటనల్లో సాయాన్ని కూడా ప్రభుత్వం తన నిర్ణయాల్లో వేసుకోవడం గమనార్హం.
          ప్రధానమైన విద్యుత్‌, ఇరిగేషన్‌, విద్య తదితర అంశాలపై వివాదం జరుగుతూనే ఉంది. ప్రజలకు సంబంధించిన అంశాలపై స్పష్టత లేకుండా మిగతా అంశాల చుట్టూనే ప్రభుత్వాన్ని కెసిఆర్‌ నడిపిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ అమలు చేయాలన్నా, వాటికి ప్రస్తుతం కేటాయించిన డబ్బులన్నీ ఖర్చు కావాలన్న వాటిని రాబోవు రెండునెలల్లోనే ఖర్చు చేయాల్సి ఉంది. లేకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను మరో బడ్జెట్‌ రానుంది. చివర్లో హడావిడిగా ఖర్చు చేస్తే పథకాల్లో అవినీతి చోటు చేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాశక్తి సౌజన్యంతో...

No comments:

Post a Comment