Tuesday, 2 December 2014

మంచి కార్యక్రమం. ఇలాంటివి ఇంకా, ఇంకా జరగాలి.... తమ్మినేని. CPIM Khammam district committee ki "Abhinandanalu".

ఈ నెల 5 నుంచి తెలంగాణాలో రైతు ఆత్మహత్యల నివారణ జాతాలు

రైతు జాతాలు, బహిరంగ సభ పోస్టర్ విడుదల చేస్తున్న పది వామపక్ష పార్టీల నాయకులు 
అవి సర్కారీ హత్యలే...

* రైతులకు భరోసా కల్పించడంలో ఘోర వైఫల్యం
* ఆత్మహత్యలు నివారించండి ఆర్థిక భద్రత కల్పించండి
* 10 వామపక్ష, కమ్యూనిస్టు పార్టీల డిమాండ్‌
* 5 నుంచి 10 వరకు జిల్లాల జాతాలు
* 11న చలో హైదరాబాద్‌
                 రాష్ట్రంలో రోజుకు 6 నుండి 9 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పది వామపక్ష, కమ్యూనిస్టు పార్టీలు ఆందోళన వ్యక్తంచేశాయి. 2014, జూన్‌ 2 నుండి నవంబర్‌ 28 వరకు రాష్ట్రంలో 565 మంది రైతులు ఆత్మ హత్యలకు పాల్పడ్డారని తెలిపాయి. అవన్నీ సర్కా రీ హత్యలేనని ప్రకటించాయి.
                రైతులకు భరోసా కల్పించడంలో, ఆదుకోవడంలో, విశ్వాసం నింపడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించాయి. రైతు ఆత్మహత్యలను నివారించాలని, రైతంగ ఆర్థిక భద్రతను కల్పించాలని డిమాండ్‌ చేశాయి. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈనెల 5 నుంచి 10 వరకు జరపనున్న జిల్లాల జాతాలకు సంబంధించిన పోస్టర్‌ను పది వామపక్ష, కమ్యూనిస్టు పార్టీల నేతలు ఆవిష్కరించారు. 
               ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 565 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని భావిస్తే బడ్జెట్‌లో నిధులు కేటాయించేదని అన్నారు. కానీ ఈ బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తెలిపారు. 70 నుంచి 80 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ప్రభుత్వం చెప్తోందని, దానిని గుర్తించినా కొంత డబ్బు కేటాయించేదని చెప్పారు. రైతు ఆత్మ హత్యలను ప్రభుత్వం గుర్తించలేదని స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. అవి ప్రభుత్వ హత్యలే తప్ప మరొకటి కాదని వివరించారు. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
                 ప్రైవేటు రుణాలపై రెండేళ్లపాటు మారటోరియం ప్రకటించాలని కోరారు. సన్న,చిన్న కారు రైతులకు అవసరమైన రుణాలు ఇవ్వాలని, విత్తనాలు, పురుగుమందులు సరఫరా చేయాలని సూచించారు. రైతు సమస్యలపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్షం పిలవాలని డిమాండ్‌ చేశారు. రైతు ఆత్మహత్యలు నివారించేందుకు అవసరమైన సహాయ చర్యలపై దృష్టి సారించాలని కోరారు. 
               సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ పది వామపక్ష, కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 5 నుండి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ''రైతుల ఆత్మహత్యల నివారణ జాతాలు'' చేపడుతున్నామని వివరించారు. రెండు టీంలుగా ఏర్పడి పది జిల్లాల్లోనూ ఈ జాతా పర్యటిస్తుందని తెలిపారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి కారణాలు, సాధకబాధకాలు తెలుసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై లోతైన అధ్యయనం చేస్తామన్నారు. రైతు ఆత్మహత్యల విషయంలో దేశంలోనే తెలంగాణ రెండోస్థానంలో ఉందన్నారు. కొత్త రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల్లో విశ్వాసం కల్పించడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. నినాదాలు ఎన్ని చెప్పినా విధివిధానాల అస్పష్టత కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. ఈనెల 11న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. 
               సిపిఐఎంఎల్‌ (న్యూడెమోక్రసీ) నేత వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ కూడా అనేక వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ నేడు రైతుల్లో భరోసా కల్పించడంలో విఫలమైందని చెప్పారు. గత ప్రభుత్వాలపై నెపం నెట్టి తప్పించుకోజూస్తోందని తెలిపారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని ప్రభుత్వ మెడలు వంచి హక్కులు సాధించుకుందామని అన్నారు. 
                 ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శులు బి సురేందర్‌రెడ్డి, జానకి రాములు, సిపిఐఎంఎల్‌ నేత భూతం వీరయ్య, ఎంసిపిఐయు నేత తాండ్రకుమార్‌, సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ నేత ఎన్‌ మూర్తి మాట్లాడుతూ కెసిఆర్‌ నియంత పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నిర్దిష్ట కాలపరిమితిలోగా ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వారి పిల్లలకు ఉచిత విద్య అందించాలని సూచించారు.
షెడ్యూల్ కోసం ఈ లింకును క్లిక్ చేయండి... Post by CPIM Telangana.
బహిరంగ సభ పోస్టర్ వివరాల కోసం ఈ లింకును క్లిక్ చేయండి. Post by CPIM Telangana.

Monday, 1 December 2014

టి.సర్కార్ ఆరు నెలల పాలన... ప్రోగ్రెస్ రిపోర్ట్


6 నెలలు..150 నిర్ణయాలు

-  కొన్ని అమలులోకి.. మరికొన్ని ప్రారంభదశల్లో..
-  ఇంకొన్ని కాగితాల్లో
-  కెసిఆర్‌ అర్థసంవత్సర పాలన 
- అమలుకు రెండు నెలల సమయం మాత్రమే 
                తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి సోమవారంతో ఆరునెలలైంది. ఈ సంవత్సరం జూన్‌ రెండున ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ ప్రమాణం స్వీకారం చేసి, ప్రభుత్వ పగ్గాలు అందుకున్నారు. ఆనాటి నుండి ఈ నెల ఒకటి వరకు ఆయన 150 నిర్ణయాలు తీసుకున్నారు. ఆరునెలల పాలనకు సంబంధించి కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయాలను బుక్‌లెట్‌ రూపంలో ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు అందించింది. వందరోజుల పాలన పూర్తి చేసే నాటికి 101 నిర్ణయాలు తీసుకుంటే, ఆరునెలల కాలానికి ఆ సంఖ్య 156కు చేరింది.
         కెసిఆర్‌ అర్థసంవత్సర పాలనలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అందులో పూర్తిగా అమలులోకి వచ్చింది కొన్ని మాత్రమే. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ప్రారంభదశల్లోనూ, ఆరంభశూరత్యంగా నిలిచాయి. ఇంకొన్ని కాగితాల్లో మూలుగుతున్నాయి. 
           లక్ష రూపాయల పంట రుణమాఫీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, అమలు చేసినా ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 17 వేల కోట్ల రుణమాఫీకి గాను మొదట విడతగా 4250 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. గతంలో వర్షాలకు పంటలకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ కింద 480 కోట్లను విడుదల చేసింది. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ ఆరంభశూరత్యంగానే నిలిచింది. మొదట విడతగా మూడువేల మందికి భూ పంపిణీ చేస్తామని ప్రకటించి, చివరికి 500 మందితో సరిపుచ్చారు. వారికి భూములు చూపించేపనిలోనే అధికారులు ఉన్నారు. మిగతా వారికి ఎప్పుడంటే..ఇదొక నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం పేర్కొనడం విశేషం. 
        కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని రాష్ట్రమంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నా, వారిని ఎప్పటోగా చేస్తారన్నదానికి గడువు విధించలేదు. అమరవీరుల కుటుంబాలకు ఆర్థికసాయం, ఉద్యోమకారులపై కేసుల ఎత్తివేత పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్‌ అందజేస్తామని చెప్పి కొంతమందికి ఇవ్వడం పట్ల రానివారంతా మండిపడుతున్నారు. అందరికీ వర్తింపచేయాలని కోరుతున్నారు. సెంట్రల్‌ స్కేల్‌ ఇస్తామని ప్రకటన కేవలం మాటలకే పరిమితమైంది. పిఆర్‌సి అమలు చేసిన తర్వాతే సెంట్రల్‌ స్కీమ్‌ను వర్తింపజేయాలని ఉద్యోగసంఘాలు కోరడంతో దాని సంగతినే ప్రభుత్వం మరిచిపోయింది. 
       మహిళా భద్రతకు ఎన్నో కార్యక్రమాలు రూపొందించినా వారిపై లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. సింగిల్‌ విండో పారిశ్రామిక విధానాన్ని అమలు చేసినా అందులో కార్మికవర్గ రక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామనేది చెప్పలేదు. వక్ప్‌భూముల రక్షణకు వక్ప్‌ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, వాటిపై సభాసంఘం వేస్తామని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాల నినాదం అమలుకు నోచలేదు. ఎస్టీలకు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ మాటలకే పరిమితమైంది. కళ్యాణలక్ష్మి, ముబారక్‌ పథకాలు పెట్టినా ఆ పథకాల ద్వారా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారన్నది బయటకు చెప్పడం లేదు.
       పెన్షన్ల పెంపు, విద్యార్థులకు ఫాస్ట్‌, ఆహారభద్రత కార్డుల పంపిణీపై ఇంకా గందరగోళంగానే ఉంది. వాటికి ప్రభుత్వం భారీగానే ఖర్చు చేస్తున్నా ఈ మూడునెలల కాలంఓ ఆ డబ్బునంతా ఖర్చు చేస్తుందా అన్నది అనుమానాస్పదమే. క్రీడల బలోపేతానికి గాకుండా పథకాలు సాధించినవారికి నగదు ప్రోత్సాహం ఇవ్వడానికి మొగ్గు చూపింది.
        హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు కూడా ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంది. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఆకాశ్‌ హర్మాలు, హైదరాబాద్‌ నాలుగు దిక్కుల ఎక్స్‌ప్రెస్‌ హైవేలు  గ్రీన్‌ హౌజ్‌ కల్టివేషన్‌, ఫామ్‌ మెకనైజేషన్‌ ఇలాంటి పథకాలపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యకమవుతున్నాయి. ఉద్యోగులకు హెల్త్‌కార్డుల పంపిణీ చేసింది. అయితే చంద్రబాబుతో చర్చలనూ, కేంద్రంతో సత్సంబంధాలు, ప్రతిష్టాత్మకంగా మెట్రో సదస్సు, తరలివస్తున్న పరిశ్రమలు, మాసాయిపేట దుర్ఘటనల్లో సాయాన్ని కూడా ప్రభుత్వం తన నిర్ణయాల్లో వేసుకోవడం గమనార్హం.
          ప్రధానమైన విద్యుత్‌, ఇరిగేషన్‌, విద్య తదితర అంశాలపై వివాదం జరుగుతూనే ఉంది. ప్రజలకు సంబంధించిన అంశాలపై స్పష్టత లేకుండా మిగతా అంశాల చుట్టూనే ప్రభుత్వాన్ని కెసిఆర్‌ నడిపిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ అమలు చేయాలన్నా, వాటికి ప్రస్తుతం కేటాయించిన డబ్బులన్నీ ఖర్చు కావాలన్న వాటిని రాబోవు రెండునెలల్లోనే ఖర్చు చేయాల్సి ఉంది. లేకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను మరో బడ్జెట్‌ రానుంది. చివర్లో హడావిడిగా ఖర్చు చేస్తే పథకాల్లో అవినీతి చోటు చేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాశక్తి సౌజన్యంతో...

Friday, 28 November 2014

కార్మిక చట్టాలకు మోడీ సర్కార్ సవరణ... 70శాతం సంఘటిత కార్మికశక్తి అడ్రస్ గల్లంతు


-స్టడీ గ్రూప్
          31శాతం ఓట్లతో గద్దెనెక్కిన మోడీ సర్కార్ దేశంలోని 70శాతం సంఘటిత కార్మికశక్తి అడ్రస్సును గల్లంతు చేసేందుకు, వారికి ఎలాంటి కార్మిక చట్టాలు, రక్షణలు వర్తించకుండా చేసేందుకు కుట్ర పన్నింది. విపక్షాల త్రీవ నిరసన నడుమ ఈ మేరకు కార్మిక చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేయించుకుంది. చట్ట రూపం దాల్చనున్న ఈ బిల్లు పేరు Labour Laws (Exemption from Furnishing Returns and Maintaining Registers by Certain Establishments) Amendment Bill, 2011. 
16 కార్మిక చట్టాలపై వేటు           
          ''ఆదాయం పన్ను వివరాలను సమర్పించడం, రిజిస్టర్లు మెయిన్ టెయిన్ చేయడం నుంచి చిన్న సంస్థలకు మినహాయింపు నిస్తున్నాం'' అనే ముసుగులో చిన్న సంస్థల నిర్వచనాన్ని, వాటికి వర్తించని చట్టాల జాబితానూ మార్చేసింది. 
           మార్చిన చిన్న సంస్థల నిర్వచనం ప్రకారం ప్రస్తుతం 19గా ఉన్న కార్మికుల సంఖ్య పరిమితిని 10 నుంచి 40కి పెంచింది. 40 మంది లోపు కార్మికులున్న ఏ సంస్థ అయినా ఈ కింది చట్టాల నుంచి మినహాయింపు పొందుతుంది. 
1. The Payment of Wages Act, 1936 (4 of 1936).
2. The Weekly Holidays Act, 1942 (18 of 1942).
3. The Minimum Wages Act, 1948 (11 of 1948).
4. The Factories Act, 1948 (63 of 1948).
5. The Plantations Labour Act, 1951 (69 of 1951).
6. The Working Journalists and other Newspaper Employees (Conditions
of Service) and Miscellaneous Provisions Act, 1955 (45 of 1955).
7. The Motor Transport Workers Act, 1961 (27 of 1961).
8. The Payment of Bonus Act, 1965 (21 of 1965).
9. The Beedi and Cigar Workers (Conditions of Employment) Act, 1966
(32 of 1966).
10. The Contract Labour (Regulation and Abolition) Act, 1970 (37 of
1970).
11. The Sales Promotion Employees (Conditions of Service) Act, 1976 (11
of 1976).
12. The Equal Remuneration Act, 1976 (25 of 1976).
13. The Inter-State Migrant Workmen (Regulation of Employment and
Conditions of Service) Act, 1979 (30 of 1979).
14. The Dock Workers (Safety, Health and Welfare) Act, 1986 (54 of
1986).
15. The Child Labour (Prohibition and Regulation) Act, 1986 (61 of 1986).
16. The Building and Other Construction Workers (Regulation of
Employment and Conditions of Service) Act, 1996 (27 of 1996).
      ఆయా సంస్థలు పై చట్టాల నుంచి మినహాయింపు పొందడం అంటే ఏమిటి? చట్టాల పేర్లన్నింటినీ జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ కార్మికుల శ్రేయస్సుకుద్దేశించిన చట్టాలని అర్థమవుతోంది. 40 మంది వరకున్న సంస్థలకు ఇవి వర్తించవంటే అర్థం ఆయా సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు ఈ 16 చట్టాల ద్వారా ఎలాంటి హక్కులూ, రక్షణా లభించబోవు.
      ఈ 16 చట్టాల్లో అత్యంత ప్రాథమిక చట్టాలున్నాయి. ఉదాహరణకు కనీస  వేతన చట్టం. వేతనాలు చెల్లించకపోతే వేతనాలు చెల్లింపు చేయమనే చట్టంమెటర్నిటీ లీవు చట్టం. ఇప్పుడు ఈ చట్టాలేవీ వర్తించవు. 
      ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెడుతూ `కార్మిక హక్కుల రక్షణ కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికే ఈ సంస్కరణలు` అని మోడీ సర్కారు చెప్పింది. ఉన్న 16 చట్టాలు వర్తించకుండా చేసి, ఉన్న హక్కులను, రక్షణలను రద్దు చేసి, హక్కుల రక్షణకోసం ఎలా కృషి చేస్తుంది? నోటితో చెప్పే మాటలకు, చట్టాల రూపంలో చేస్తున్న చేతలకు మధ్య తేడా లేకపోతే దానినేమనాలి? పచ్చి కపటనాటకం తప్ప.
నష్ట పోయే వారి సంఖ్య లక్షల్లో కాదు కోట్లల్లో...     
  15వ లోక్ సభ, కార్మికులు మరియు ఉపాధి స్టాండింగ్ కమిటీ (2011-12) ఈ బిల్లును అధ్యయనం చేసింది. ఈ బిల్లు అమలైతే ప్రభావితం కాబోయే కార్మికుల సంఖ్యను లెక్కించేందుకు ప్రయత్నించింది.  "Based on Economic Census, 2005 conducted by Central Statistical Organization, there are a total of 418.27 lakh (41.83 million/4.18 crore) establishments with a total employment of 1009.04 lakh (100.90 million/10.09 crore) persons. The break-up of ̳small ఆstablishments‘ is not available." అని చెప్పింది. 
       ఇవి 2005 నాటి లెక్కలు. ఇప్పుడు సంఖ్య పెరిగి ఉంటుంది. అయితే ఇది కూడా  గణాంకాల శాఖ  సేకరించిన లెక్కలు. పరిశ్రమల శాఖ, లేదా కార్మిక శాఖ వద్ద చిన్న పరిశ్రమలకు సంబంధించిన ఎలాంటి గణాంకాలూ లేవు. అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు.
గణనీయంగా పెరగనున్న అసంఘటిత రంగం...
        ప్లానింగ్ కమిషన్ గణాంకాలు, భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం భారతదేశంలో 48.7కోట్ల మంది కార్మికులున్నారు. వీరిలో 94శాతం మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. వీరికి ఎలాంటి చట్టాలూ వర్తించవు. రక్షణలూ లేవు. వీరిని తక్షణం సామాజిక భద్రత కిందకు తీసుకురావాలని ప్లానింగ్ కమిషన్ స్వయంగా చెప్పింది.    
  మొత్తం కార్మిక శక్తిలో ఆరుశాతం సంఘటిత రంగంలో ఉంది.
       కార్మిక చట్టాలు, ఇతర నియంత్రణల కోసం ప్లానింగ్ కమిషన్ వర్కింగ్ గ్రూపు ప్రకారం (27వ పేజీలో) ``The Working Group recognized that for around 94 per cent of the workforce being employed in the unorganized sector there is an urgent need to protect their interest by providing them the minimum living wage,
improved regulatory activities, basic social security and labour welfare schemes and improved health and safety facilities. The living standards of this segment of the workforce need urgent attention since the workers in this sector have no security of job and are often deprived of the basic rights under various labour laws. The enactment of the Unorganized Workers Social Security Act, 2008 is a step in the right direction but still much more needs to be done.``
        ఆరుశాతంగా ఉన్న సంఘటిత కార్మిక శక్తిలో 70శాతం వాటా చిన్న సంస్థలది. కార్మికులు, ఉద్యోగుల సంఖ్యను 40 వరకు పెంచి `చిన్న సంస్థల`  నిర్వచనం మార్చేయడంతో ఈ వాటా 95శాతానికి పెరగనుందని ఒక అంచనా.
       ఏ చట్టాలు వర్తించని వారు అసంఘటిత రంగ కార్మికులు అనుకుంటే, ఏ చట్టాలూ  వర్తించకుండా చిన్న సంస్థల్లో పని చేస్తున్న కార్మికులంతా అసంఘటిత కార్మికులే అవుతారు. కార్మిక చట్టాలు అమలయ్యేది మిగిలిన భారీ ప్రభుత్వ రంగ, ప్రయివేటు రంగ సంస్థలు, వాటిశాఖల్లో మాత్రమే.
       ఈ లెక్కన, ఎంత సరైన సంఖ్య కానప్పటికీ భారతదేశంలోని 48.7 కోట్ల కార్మికుల్లో కార్మిక చట్టాలు వర్తించని వారి సంఖ్య 46కోట్లుగా ఉండబోతోంది...
చట్టం మార్చడం వల్ల ఎవరికి ఉపయోగం?       
          స్టాండింగ్ కమిటీ రిపోర్టు 29వ పేజీలో ఇలా ఉంది. ''Regrettedly, the Government have
neither any information regarding the number of persons working in these 'Small Establishments' nor are they aware as to whether all these establishments are regularly submitting their returns.``
       దీనర్థం ఏమిటి? ఇప్పటి వరకు ప్రభుత్వపరంగా ఏది చిన్న సంస్థ? ఎంత మంది కార్మికులున్నారు? అనే రికార్డే మెయిన్ టెయిన్ చేయడం లేదు. అలాంటిది చిన్న  సంస్థల్లో ఉన్న కార్మికుల శ్రేయస్సును కాపాడేందుకు ఈ సవరణను తీసుకువచ్చానని మోడీ సర్కారు చెబుతోంది.
       కమిటీ రిపోర్టులోని అదే పేజీలో ఇలా పేర్కొంది. ''The Committee observe that the objective behind Section 4(5) of the amendment Bill, 2011 is to exempt the employers from imposition of penalties. In the given scenario when there is no provision of punishment in the Act itself, it is open for the establishment not to furnish the returns which could reveal his status of micro, small and medium enterprise. The Committee are of theconsidered view that a Law without penal provision is teethless and cannot be enforced.``
       ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లులో యాజమాన్యాల మీద ఎలాంటి పెనాల్టీని ప్రతిపాదించలేదు. శిక్షలు కూడా లేవు. శిక్షలు, పెనాల్టీలు లేకపోతే మిగిలిన హక్కులు కూడా వర్తిస్తాయన్న గ్యారెంటీ లేదు. 
         పోనీ చట్టం మార్చిన తరువాతైనా పరిశ్రమలను మానిటర్ చేసే సత్తా సంబంధిత శాఖకు ఉందా అంటే లేదని స్టాండింగ్ కమిటీ సభ్యుల పరిశీలనలో తేలిపోయింది. పరిశ్రమల శాఖ, కార్మిక శాఖకు సంబంధించిన సిబ్బంది గణాంకాలు, స్వయంగా కొన్ని ప్రాంతాల్లో కార్యాలయాలు తనిఖీ చేసి ఈ నిర్దారణకు వచ్చారు.
       లెక్కలు లేవు. శిక్షలు లేవు. శిక్షించే వారూ లేరు. అంటే ఆధునిక భారతదేశంలో ఆయా సంస్థల్లో పని చేస్తున్న కార్మికులంతా ఎలాంటి రక్షణలు లేకుండా కట్టుబానిసలుగా పని చేయాల్సిన  స్థితిని మోడీ ప్రభుత్వం సృష్టించింది. కార్మికులు ఎదురుతిరిగితే యాజమాన్యం దాడులు చేయొచ్చు. తొలగించొచ్చు. వారిని అడిగేవారూ ఉండరు. 
కార్మికుల అడ్రస్సు గల్లంతు
       చిన్న సంస్థలు గతంలో కార్మికుల పేర్లు, వారి అడ్రస్సులు కూడా నింపి ఇవ్వాల్సిన అవసరం ఉండేది. మోడీ సర్కార్ సవరించిన బిల్లు ప్రకారం కార్మికుల సంఖ్య పేర్కొంటే సరిపోతుంది. కార్మికుల అడ్రస్సుతో పని లేదు. 
       కార్మికుడి పేరు, అడ్రస్సు ఉంటే ఇఎస్ఐ, పిఎఫ్ వంటివి పొందేందుకు ఆస్కారం లభించేది. ఇప్పుడు పేర్లు అక్కర్లేదు. కాబట్టి ఈ రెండూ వర్తించవు. ఇఎస్ఐ స్థానంలో ఇన్సూరెన్స్ ను ప్రవేశపెడుతున్నారు. అయితే దీనిని కూడా కార్మికులు, ఉద్యోగులు తమ స్వంత డబ్బులతో కొనుక్కోవాలి.
        కార్మికుడి అడ్రస్సు రిజిస్టర్ అయి ఉంటే, ప్రమాదం జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించే అవకాశం ఉంటుంది. వలస వచ్చిన కార్మికులు మహబూబ్ నగర్ లో చనిపోతే వారి అడ్రస్ లేకపోవడం వల్ల మహబూబ్ నగర్ లోనే ఖననం చేశారు. రేపు రేపు చిన్న సంస్థల ముసుగులో ఉన్న పరిశ్రమలన్నింటా ఇదే జరగబోతోంది. 
ఏది చిన్న సంస్థ?
      ఒక సంస్థ చిన్నదా? పెద్దదా? అని నిర్ణయించేటప్పుడు కార్మికుల సంఖ్యను చూడాలా? లేదా ఆ సంస్థ పెట్టుబడిని చూడాలా? కార్మికుల సంఖ్యను బట్టి చూస్తే ఎంత ఎక్కువ మంది కార్మికులుంటే అంత పెద్ద సంస్థ అనుకునే అవకాశం ఉంది. అదే పెట్టుబడిని బట్టి చూస్తే ఎంత ఎక్కువ పెట్టుబడి ఉంటే అంత పెద్ద సంస్థ అవుతుంది. కార్మికుల సంఖ్య తక్కువగా ఉండి, పెట్టుబడి ఎక్కువగా ఉండే సంస్థలు చిన్న సంస్థలా? పెద్ద సంస్థలా?
      ఓ ఉదాహరణ చూద్దాం. విజయవాడ ల్యాంకో వందలకోట్ల పెట్టుబడితో పెట్టిన పరిశ్రమలో పనిచేసే కార్మికుల సంఖ్య కేవలం 27. ఇప్పుడిది పెద్ద సంస్థనా? చిన్న సంస్థనా?
     పెట్టుబడి ఎక్కువగా ఉండి, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించే అనేక బడా సంస్థలు ఇప్పుడు అతి తక్కువ మంది కార్మికులను కలిగి ఉంటున్నాయి. వీటి టర్నోవర్ కోట్లలో ఉంటుంది. లాభాలూ అలాగే ఉంటాయి. 40 అనే సంఖ్యను ప్రకటించడం ద్వారా ఇలాంటి సంస్థల్లో పనిచేసే కార్మికులందరూ హక్కులను, చట్టాల ద్వారా రక్షణలనూ కోల్పోనున్నారు.
      మరో ఉదాహరణ చూద్దాం.... ఫ్యాక్టరీ చట్టం ప్రకారం ఫ్యాక్టరీ నిర్వచనం ఇలా ఉంటుంది.  కరెంటు ఉండి 10 మంది కార్మికులుండాలి. లేదా కరెంటు లేకుండా 20 మంది కార్మికులుండాలి. ఇప్పుడు ఈ సంఖ్యను కూడా వరుసగా 20, 40కి పెంచేశారు. ఒకసారి అది ఫ్యాక్టరీ అనే నిర్వచనం కిందకు వస్తే దీనికి సంబంధించిన అన్ని చట్టాలూ వర్తించాలి.
      కరెంటుతో సంబంధం ఉన్నా, లేకపోయినా 40మంది వరకు కార్మికులుంటే ఏ చట్టాలూ వర్తించవని చెప్పిన తరువాత ఫ్యాక్టరీ చట్టంలో భాగంగా వర్తించే చట్టాలన్నీ ఒక్కసారిగా కొట్టివేయబడ్డట్లే.
మరిన్ని కార్మిక సంస్కరణలు     
     ఈ ఒక్క బిల్లుతోనే బిజెపి ప్రభుత్వం ఆగిపోలేదు. మిగిలిన కార్మిక చట్టాలనూ సవరిస్తోంది. ఉదాహరణకు  చిన్న సంస్థల్లో బోనస్ 8.33శాతమే ఇవ్వాలని నిబంధన విధించారు. ఇప్పటివరకు కొన్ని సంస్థల్లో 20శాతం వరకూ ఇచ్చేవారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని కార్మికులు కోల్పోబోతున్నారు. పిఎఫ్, గ్రాట్యూటీ వంటివన్నీ సొంత డబ్బులతో కొనుక్కోవాల్సిన పరిస్థితి 
     కార్మికుల సమస్యలను రిప్రజంట్ చేయడానికి 51శాతం కార్మికులుండాలన్న నిబంధనను తీసుకువచ్చారు. చిన్న సంస్థల్లో 40 మంది అంటే దాదాపు 21 మంది రిప్రజంటేషన్ కు సిద్ధపడాలి. యాజమాన్యం 90 రోజుల్లో పరిష్కరించకపోతే లేబర్ కోర్టుకు పొమ్మంటున్నారుపోరాడే హక్కును లేకుండా చేస్తున్నారు.
     ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ వంటివన్నీ సొంత డబ్బులతోనే కొనుక్కునే విధంగా చట్టాలను మార్చేస్తున్నారు.
     ప్రధాని నరేంద్ర మోడీ దేశదేశాలు తిరిగి ఊదరగొడ్తున్న 'ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ` మోడల్ ఇదే. కార్మికులను కొట్టి కార్పొరేట్లకు వేయడమే దీని సారాంశం. 
ఈ సంస్కరణల వెనుక...?
     ఎన్నికలకు ముందు నుంచే దేశంలోని బడా కార్పొరేట్లు, పెట్టుబడిదార్లు ఈ సంస్కరణల కోసం భారీ కసరత్తు ప్రారంభించారు. అందులో కీలకమైనది.. ''ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ3 ఏర్పడాలి. లేదంటే మోడీ నాయకత్వంలో మోడీ 2 ఏర్పడాలి. వామపక్షాల ప్రమేయం గల ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఏర్పడకూడదు. ''
    వారెందుకిలా కోరుకున్నారు? కారణం సుస్పష్టం. ''ప్రపంచం, మన దేశం కూడా ఆర్థిక సంక్షోభంలో ఉంది. రానున్న కొద్ది సంవత్సరాల్లో ఈ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడే మార్గం కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారీ వర్గం గరిష్ట లాభాలు తగ్గకుండా ఉండాలి. అలా జరగాలంటే సంక్షోభ భారం ప్రజలపై వేయాలి. తమకు లాభాలు తెచ్చిపెట్టే విధానాలు అమలు చేయాలి. అలాంటి ప్రభుత్వమే కేంద్రంలో ఉండాలి. జిడిపి బాగా అభివృధ్ధి చెందుతున్న సమయంలో పాలకవర్గాలకు గరిష్ట లాభాలు సమకూరుస్తూనే,  ప్రజలకు కొన్ని సంక్షేమ చర్యలు చేపట్టే శక్తి ప్రభుత్వానికి ఉంటుంది. కాని సంక్షోభ కాలంలో ప్రభుత్వం ముందు - బడా పెట్టుబడిదారుల లాభాలపై పన్నులు పెంచి ప్రజలకు వెసులుబాటు కలిగించడమా? లేక ప్రజలపై భారాలు వేసి కార్పొరేట్ రంగం లాభాలు కాపాడడమా- ఏదో ఒక మార్గమే ఉంటుంది.'' 
      కార్పొరేట్ల అండతో గెలిచిన మోడీ సర్కార్ ఇప్పుడు ఆ మార్గాల్లో రెండో మార్గం ఎంచుకుంది. ప్రజలకు, కార్మికులకు ఉన్న హక్కులు, రక్షణలు తొలగిస్తే మార్కెట్లు, పెట్టుబడిదారులు వారిని యథేచ్చగా దోపిడీ చేసుకనేందుకు వీలు కలుగుతుంది. కార్పొరేట్ రంగానికి ఇబ్బడి ముబ్బడి లాభాలు సమకూరుతాయి. కార్మిక చట్టాల సంస్కరణ పేరిట ఇదే జరుగుతోంది. ఇన్నాళ్లూ ఇలాంటి సంస్కరణలు దొంగచాటుగా జరిగేవి. ఇప్పుడు పాదర్శకం పేరిట పచ్చిగా అమలు జరుగుతున్నాయి.  విస్తృత కార్మికవర్గ పోరాటాల ద్వారానే ఇలాంటి విధానాలను తిప్పికొట్టగలం.

Thursday, 9 October 2014

పవర్‌ హాలీడేలిస్తే పరిశ్రమలెలా వస్తాయి?

          

         
        రోజుకు నాలుగు గంటల విద్యుత్‌ కోతలు, వారంలో రెండు రోజులు పరిశ్రమలకు పవర్‌ హలీడే ఇస్తే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇలాగైతే హైదరాబాద్‌ విశ్వనగరంగా తీర్చిదిద్దడం అసాధ్యమని, ఇలాంటి విద్యుత్‌ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ఎలా పరిశ్రమలు స్థాపిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే తెలంగాణ నుంచి అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయాయన్నారు. రాష్ట్రంలో పవర్‌ హాలీడే వల్ల ఆర్థిక వ్యవస్థ తలకిందులవుతుందని, కాబట్టి రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యను పరిష్కరించేందుకు నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సిపిఎం గ్రేటర్‌ హైదరాబాద్‌ నార్త్‌ జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశాన్ని భోలక్‌పూర్‌లోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు హరిప్రసాద్‌ అధ్యక్షతన బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా తమ్మినేని వీరభద్రం హాజరై మాట్లాడారు. ఎన్నికల సందర్భంలో కెసిఆర్‌ ఇచ్చిన అనేక హామీలు అమలుకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. భూమి లేని దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ప్రకటించారని, కానీ రాష్ట్రంలో భూమి లేదని ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్‌ఆర్‌ఐలనుంచి భూమి కొనుగోలు చేసి పంచుతామని చెబుతుందని, ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారనే విషయం మాత్రం ప్రకటించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అప్పులబాధతో ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయనీ, కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా ఆకలి చావులు కూడా మళ్లీ మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, టిడిపి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలే టిఆర్‌ఎస్‌ అనుసరిస్తోందని విమర్శించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చరిత్రను వక్రీకరించే పనిలో పడిందని, దీనికోసం ప్రత్యేకంగా సుదర్శన్‌రావు అనే మతతత్వ వాదిని నియమించిందన్నారు. దేశంలో మతతత్వ ఘర్షణలు పెంచేందుకు మోడీ కుట్ర పన్నుతున్నారని, మత సామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. 

Tuesday, 7 October 2014

ఆకలి చావులు సంభవించడం ఘోరం : సిపిఎం


             నిజామాబాద్‌ జిల్లా నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన టేకుమాల దుర్గయ్య (55) ఆకలి చావుకు గురికావడం అత్యంత ఘోరమని, విషాదకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దుర్గయ్యకు అంత్యోదయ అన్నయోజన పథకం కింద వచ్చే 35 కిలోల బియ్యాన్ని నిలిపేయడంతో తిండిగింజలు కరువై పస్తులున్నాడని తెలిపారు. నెలరోజులుగా గ్రామస్తులు ఎవరైనా తిండిపెడితే తింటున్నాడని, లేనిరోజు పస్తులున్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆకలిని భరించలేక ఈనెల 6న సాయంత్రం అతను నివాసముంటున్న గుడిసె వద్ద ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడని తెలిపారు. అంత్యోదయ అన్నయోజన కార్డు రద్దు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందే సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం వాంఛనీయం కాదని తెలిపారు. కనీసం కేంద్రం ఇస్తున్న సబ్సిడీనైనా ప్రజలు పొందేలా ప్రభుత్వం తగు నియమనిబంధనలు రూపొందించి అమలు చేయాలని సూచించారు.