Tuesday, 7 October 2014

ఆకలి చావులు సంభవించడం ఘోరం : సిపిఎం


             నిజామాబాద్‌ జిల్లా నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన టేకుమాల దుర్గయ్య (55) ఆకలి చావుకు గురికావడం అత్యంత ఘోరమని, విషాదకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దుర్గయ్యకు అంత్యోదయ అన్నయోజన పథకం కింద వచ్చే 35 కిలోల బియ్యాన్ని నిలిపేయడంతో తిండిగింజలు కరువై పస్తులున్నాడని తెలిపారు. నెలరోజులుగా గ్రామస్తులు ఎవరైనా తిండిపెడితే తింటున్నాడని, లేనిరోజు పస్తులున్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆకలిని భరించలేక ఈనెల 6న సాయంత్రం అతను నివాసముంటున్న గుడిసె వద్ద ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడని తెలిపారు. అంత్యోదయ అన్నయోజన కార్డు రద్దు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందే సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం వాంఛనీయం కాదని తెలిపారు. కనీసం కేంద్రం ఇస్తున్న సబ్సిడీనైనా ప్రజలు పొందేలా ప్రభుత్వం తగు నియమనిబంధనలు రూపొందించి అమలు చేయాలని సూచించారు.

No comments:

Post a Comment