Tuesday, 7 October 2014

పుస్తకాలుకాల్చేస్తే చరిత్ర మారుతుందా?

            
            మార్క్సిస్టులు, పాశ్చాత్యలు, ముస్లింలు రచించిన చరిత్ర పుస్తకాలను తగులబెట్టండని. బిజెపి సీనియర్‌నేత, మాజీ కేంద్ర మంత్రి సుబ్రమాణ్యస్వామి పిలుపునివ్వటం దారుణం. ఫైళ్ళ ప్రక్షాళన పేరుతో, ఇప్పటీకే ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాల మేరకు, హోంమంత్రిత్వ శాఖ దాదాపు లక్షన్నర ఫైళ్ళను ధ్వంసం చేసింది. వాటిలో కొన్ని చారిత్రక క్షణాలకు సంబంధించిన సమాచారం వుందనీ వార్తలు వెలువడ్డాయి. మహాత్మాగాంధీ హత్య వార్తను ప్రకటించడానికి ముందు జరిగిన కేబినెట్‌ సమావేశం వివరాలున్నఫైళ్ళు కూడా ధ్వంసం చేసారన్న ఆరోపణలకు స్పష్టమైన సమాధానం లేదు. నిత్యం మహాత్మాగాంధీతో పోల్చుకొని మహాత్మునిలా స్వచ్ఛ భారత్‌ నిర్మాణం జరగాలని ప్రగల్బాలు పలికే మన ప్రధాని, గాంధీ చరిత్రను ధ్వంసం చేయాలని చూస్తున్నారు. మహాత్మాగాంధీని హత్యచేసిన తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలన్న నిర్ణయం తీసుకున్నది, ఆనాటి హోం మరియు డిప్యూటీ ప్రధాని అయిన సర్దార్‌ పటేల్‌. ఈ విషయం అప్పటి కెబినెట్‌ సమావేశాల రికార్డుల ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకు తెల్సిన సమాచారం ప్రకారం ఆ రికార్డులను మాయం చేశారు. పటేల్‌కు అన్ని ప్రాంతాలనుండి ఇనుప ముక్కలు తీసుకెళ్ళి పెద్ద విగ్రహం కట్టించాలనుకుంటున్నారు. కాని ఆయన తీసుకున్న నిర్ణయాలను విగ్రహం క్రిందపాతరేసి చరిత్రను తిరగ రాయలనుకుంటున్నట్లు కన బడుతున్నది. 
                         బిజెపి ఎప్పుడు ఆధికారంలోకి వచ్చినా చరిత్ర రచనతో చెలగా టం మొదలవుతుంది. జనతా పార్టీలో భాగస్వామిగా 1977లో మంత్రి వర్గంలో చేెరినప్పుడు కూడా మొదట చేసిన పని చరిత్ర రచనపై దాడి. రొమిల్లా థాపర్‌ వంటి అగ్రశేణి చరిత్ర పరిశోధకులు రాసిన పాఠ్య పుస్తకాలను ఉపసంహరించటం మొదలుపెట్టారు. దానిపై పెద్ద దుమారం చెలరేగింది. అయితేనేెం వారి ధోరణి మారలేదు. మళ్ళీ 1998 వాజ్‌పేయి నాయకత్వంలోని బిజెపి, ఎన్‌డిఎ పాలనలో ఇదే పునరావృ తమైంది. బిజెపి ఆధికాంలో వున్న రాష్ట్రాలలో స్కూల్‌ పుస్తకాలు లౌకిక విలువలకు విరుద్ధంగా, తమ రాజకీయ ప్రయోజ నాలకను కూలంగా మార్పు చేసుకున్నారు. ఈ సారి పూర్తి మెజారిటీితో ప్రధాని స్థానంలో వున్నారు గనుక, దాడి తీవ్రత ఎక్కువగానే పెరుగుతుంది. ఐసిహెచ్‌ఆర్‌, అంటే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రీసెర్చ్‌, ఛైర్మన్‌గా మోడీ సర్కారు ఎల్లాప్రగడ సుదర్శనరావును నియమించుకున్నది. ఈయనను ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులైౖన మేధావులే అంగీకరించలేదు. ఆయన భారతదేశ చరిత్ర, శాస్త్రీయ పరిశోధనకు భిన్నంగా, రామాయణ భారతాలతో మొదలవుతుంది. రోత పుట్టించే కుల వ్యవస్థ వల్ల దేశానికి మేలు జరుగుతుందంటారు. కాలంచెల్లిన ఈ దురభిప్రాయాలను పట్టుకువేళ్ళాడే వారిని చరిత్ర పీఠాధిపతిని చేయడం కన్నా దౌర్భాగ్యం ఏముంటుంది?
                     ప్రతిదేశం, ప్రతిజాతి తమ గతాన్ని గొప్పగానే భావిస్తాయి అయితే అందులో మంచి చెడులను నిరావేశంగా బేరీజువే సుకోవాలి. ఇప్పటి రాజకీయ అవసరాలనుబట్టి లేక మత విశ్వాసాలను బట్టి గతాన్ని చిత్రిస్తామంటేె అనర్థమే మిగులు తుంది. ఇప్పుడు హిందూ ముస్లిం తగాదాలను రగిలించడమేగాక గతాన్ని కూడా ఆతరహలోనే విభజించాలని చూడటం వినాశ కరం. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధినేత మోహన్‌ భగవత్‌ దసరా ప్రసంగాన్ని గంటసేపు ప్రత్యక్ష ప్రసారం చేయటం కనీవినీ ఎరుగని వైపరీత్యం. ఆర్‌ఎస్‌ఎస్‌ మత ప్రాతిపదికపై జనాన్ని చీల్చి మెజారిటీ మతతత్వ విషాన్ని ఎక్కించజూసే ఒక ఫాసిస్టు సంస్థ. దానికి అధినేతగా ఉన్న వ్వక్తి ప్రసంగాన్ని ప్రజాధనంతో నడిచే దూరదర్శన్‌ ప్రత్యక్షప్రసారం చేయడమంటే వివిధ మతాలకు, భాషలకు నెలవైన ఈ దేశాన్ని ఇక్కడి ప్రజలను అవమానించడమే అవుతుంది. అంతేకాదు, గాంధీని హత్యచేసిన వ్యక్తి మాతృసంస్థ ఆరెస్సెస్‌, సరిగ్గా గాంధీ జయంతి తెల్లారే, ఆ సంస్థ అధినేత దూరదర్శన్‌ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం చేయటం ప్రమాదఘంటికలకు చిహ్నం.
                    యుపిఎ ప్రభుత్వం ఆయా వ్యవస్థలను సంస్థలను భ్రష్టుపట్టించిందంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర విమర్శలు చేసింది. బిజెపి ఇప్పుడు ప్రసారభారతికి స్వతంత్ర ప్రతిపత్తిని కాలరాస్తూ, కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖే భగవత్‌ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయవల్సిందిగా ఆదేశించింది.యుపిఎ ప్రభుత్వాన్ని సోనియా తన రిమోట్‌ కంట్రోల్‌తో నడిపిస్తుందని ఆరోపించిన బిజెపి, ఎన్‌డిఎ హయాంలో పార్టీని, ప్రభుత్వాలను రెండింటిని ఆర్‌ఎస్‌ఎస్‌ అనే రాజ్యాంగేతర శక్తి రిమోట్‌ కంట్రోల్‌తో నడిపిస్తుంది. ఈ వైఖరి రానున్న రోజులలో మరింత విశృంఖల రూపం తీసుకుంటుందన్నది నిస్సందేహం.
(ప్రజాశక్తి సంపాదకీయం 07102014)

No comments:

Post a Comment