విద్యుత్ కొరత నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
- ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోవడం సరికాదు
- సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. గతంలో అనేకసార్లు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలిపింది. ఫలితంగా పెద్దఎత్తున నష్టం వాటిల్లిందని పేర్కొంది. ప్రతిపక్షాలు ఈ సమస్యను రాజకీయం చేస్తున్నాయని ప్రకటించి ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోవడం సరైంది కాదని తెలిపింది. ప్రతిపక్షాలిచ్చే సలహాలనూ పరిగణనలోకి తీసుకొని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం జల్దిపల్లి గ్రామానికి చెందిన తెగుళ్ల హనుమంతు, హన్మయ్యతోపాటు మరో 50 మంది రైతులు బావుల కింద సేద్యం చేసిన తమ వరి పైర్లు ఎండిపోవడంతో వాటికి నిప్పుపెట్టారని తెలిపారు. కౌలురైతు ముంబై స్వామి పురుగుల మందు తాగేందుకు పొలంలోనే ప్రయత్నించాడని పేర్కొన్నారు. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని మండలాల రైతులు రోడ్ల మీదకు వచ్చి కరెంటు కోతలు తీర్చాలని ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. రాంపూర్ గ్రామ (నిజామాబాద్) పరిధిలోని 100 కెవి ట్రాన్స్‌ఫార్మర్ తొమ్మిదిసార్లు కాలిపోయిందని పేర్కొన్నారు. విద్యుత్ కోతలతో బావుల కింద వేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా ఆందోళనలకు దిగడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు.
పంట చేతికి వస్తున్న దశలో విధిస్తున్న కోతలతో రైతులు తల్లడిల్లుతున్నారని తెలిపారు. కనీసం పంటలను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని, విద్యుత్ కొనుగోలు చేసైనా పంటను రక్షించాలని, ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేశామని పేర్కొన్నారు. పరిశ్రమలకు వారంలో ఒక రోజు విద్యుత్ సెలవు ప్రకటించారని తెలిపారు. మరోరోజు ప్రకటించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. విద్యుత్ సెలవు ప్రకటనతో పరిశ్రమలు పూర్తిగా తమ ఉత్పత్తిని కొనసాగించలేకపోతున్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేక కొందరు పరిశ్రమలు మూసివేస్తున్నారని, మరికొందరు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. ఉత్పత్తి, ఉపాధిపై వీరి ప్రభావం తీవ్రంగా ఉంటోందని తెలిపారు. చివరకు ప్రభుత్వ కార్యాలయాలూ పనిచేయలేని పరిస్థితి వస్తోందని పేర్కొన్నారు. ప్రమాదం మరింత ముంచుకురాకముందే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
వారంరోజులుగా దక్షిణాది గ్రిడ్ నుంచి యూనిట్‌కు రూ.8.50 చొప్పున రోజు 14 నుంచి 15 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నామని విద్యుత్ శాఖ చెప్తున్నా పరిస్థితుల్లో ఏ మార్పూ లేదని తెలిపారు. గ్రామాల్లో 10 నుంచి 12 గంటలు విద్యుత్ సక్రమంగా రావడం లేదని పేర్కొన్నారు. ఎంత ఖర్చయినా విద్యుత్ కొనుగోలు చేస్తామని చెప్తున్న సిఎం అధికారానికి వచ్చి నాలుగు మాసాలైనా నేటికీ రోజుకు 25 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత కొనసాగుతూనే ఉందని తెలిపారు. రబీ సీజన్‌లో ఏ పంటలు వేయాలో ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికతో కాంటింజెన్సీ పథకాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. వ్యవసాయ, విద్యుత్ శాఖలను సమన్వయం చేసి రబీ పంటల దిగుబడిని పెంచడానికి, ఖరీఫ్‌లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నించాలని కోరారు. ఖాళీగా ఉన్న లైన్‌మెన్ పోస్టులను భర్తీ చేసి అన్ని పంపుసెట్లకూ కెపాసిటర్లు బిగించడం ద్వారా కొంత నష్టాన్ని అధిగమించవచ్చని అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తెచ్చామని తెలిపారు. ఖరీఫ్‌లో బావుల కింద పంటలు వేసి నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో ఉపాధి కోల్పోకుండా విద్యుత్ సరఫరాను మెరుగుపర్చాలని సూచించారు.
No comments:
Post a Comment