Monday 6 October 2014

డీజిల్‌ ధరలను తగ్గించండి : సిపిఎం డిమాండ్

 న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ డీజిల్‌ ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం, చమురు మార్కెటింగ్‌ కంపెనీలు (ఓఎంసిలు) తిరస్కరించడాన్ని సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ముడి చమురు ధర బ్యారెల్‌కు 92 డాలర్లు తగ్గింది. 27మాసాల కాలంలో ఇదే అత్యంత కనిష్ట ధర. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క లీటరు డీజిల్‌పై విక్రయానికి రు.1.90 మొత్తాన్ని చమురు మార్కెటింగ్‌ కంపెనీలు సంపాదిస్తున్నాయని తెలుస్తోంది. ఇది 'అధిక రికవరీ' అని సిపిఎం పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. 2013 జనవరి నుండి ప్రతి నెల లీటరుకు 50పైసలు చొప్పున పెంచాలని ప్రభుత్వం చమురు మార్కెటింగ్‌ కంపెనీలను ఆదేశించింది. ఆనాడు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతూ వస్తున్న ముడి చమురు ధరలను దృష్టిలో పెట్టుకుని యుపిఎ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ మోడీ సర్కార్‌ డీజిల్‌ ధరలను తగ్గించకుండా ఆనాటి విధానాన్నే అనుసరిస్తోందని సిపిఎం విమర్శించింది. ఈ రకమైన నిష్క్రియాపరత్వం వల్ల ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోంది. ముఖ్యంగా రైతులపై, చిన్న తరహా పరిశ్రమలపై, వస్తువుల రవాణా రంగంపై భారం పడుతోందని సిపిఎం విమర్శించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెద్ద ఎత్తున తగ్గిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తక్షణమే డీజిల్‌ ధరలను తగ్గించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది.

No comments:

Post a Comment