Thursday 9 October 2014

పవర్‌ హాలీడేలిస్తే పరిశ్రమలెలా వస్తాయి?

          

         
        రోజుకు నాలుగు గంటల విద్యుత్‌ కోతలు, వారంలో రెండు రోజులు పరిశ్రమలకు పవర్‌ హలీడే ఇస్తే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇలాగైతే హైదరాబాద్‌ విశ్వనగరంగా తీర్చిదిద్దడం అసాధ్యమని, ఇలాంటి విద్యుత్‌ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ఎలా పరిశ్రమలు స్థాపిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే తెలంగాణ నుంచి అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయాయన్నారు. రాష్ట్రంలో పవర్‌ హాలీడే వల్ల ఆర్థిక వ్యవస్థ తలకిందులవుతుందని, కాబట్టి రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యను పరిష్కరించేందుకు నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సిపిఎం గ్రేటర్‌ హైదరాబాద్‌ నార్త్‌ జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశాన్ని భోలక్‌పూర్‌లోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు హరిప్రసాద్‌ అధ్యక్షతన బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా తమ్మినేని వీరభద్రం హాజరై మాట్లాడారు. ఎన్నికల సందర్భంలో కెసిఆర్‌ ఇచ్చిన అనేక హామీలు అమలుకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. భూమి లేని దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ప్రకటించారని, కానీ రాష్ట్రంలో భూమి లేదని ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్‌ఆర్‌ఐలనుంచి భూమి కొనుగోలు చేసి పంచుతామని చెబుతుందని, ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారనే విషయం మాత్రం ప్రకటించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అప్పులబాధతో ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయనీ, కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా ఆకలి చావులు కూడా మళ్లీ మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, టిడిపి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలే టిఆర్‌ఎస్‌ అనుసరిస్తోందని విమర్శించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చరిత్రను వక్రీకరించే పనిలో పడిందని, దీనికోసం ప్రత్యేకంగా సుదర్శన్‌రావు అనే మతతత్వ వాదిని నియమించిందన్నారు. దేశంలో మతతత్వ ఘర్షణలు పెంచేందుకు మోడీ కుట్ర పన్నుతున్నారని, మత సామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. 

No comments:

Post a Comment