Sunday 25 January 2015

యుద్దోన్మాది అమెరికాకు భారత్ ఇక అధికారిక జూనియర్ భాగస్వామి... ఉమ్మడి ప్రకటన సారాంశమిది... ఈ ప్రకటన మన దేశ ప్రజానీకానికి నష్టం.. ప్రపంచానికి రాంగ్ సిగ్నల్...





-----`ఇక చర్చించాల్సిన అంశాలేమీ లేవ్. కేవలం కాంట్రాక్టులు కుదుర్చుకోవడమే మిగిలింది`... ఒబామా, మోడీ నేతృత్వంలో ఇరు దేశాల ప్రతినిధుల బృందం చర్చ పూర్తి అయ్యిందో లేదో పిఎంఓ నుంచి మీడియాకు అందిన లీక్ ఇది.  దీంతో కార్పొరేట్ మీడియా `నమో`స్తే ఒబామా.... అంటూ హోరెత్తించేసింది. అసలు లోపల చర్చ ఏం జరిగింది? అందులో వివరాలేంటి అనేది ఇంకా ఎవ్వరికీ తెలియదు. యుద్దోన్మాది, ఇతర దేశాల సార్వభౌమాధికారాలను కూల్చడంలో `బిజీ`గా ఉన్న అమెరికా అధ్యక్షుడితో చర్చల్లో అన్ని అంశాలు క్లియర్ అయిపోయాయని లీక్ వచ్చిందంటే ఎవరికి ఎవరు లొంగిపోయారో అప్పుడే తెలిసిపోయింది. మోడీ, ఒబామా బయటకు వచ్చిన తరువాత ఇరువురు తమ చర్చల సారాంశాన్ని వివరించారు. తెరవెనుక జరిగిన అనేక విషయాలను దాచారు.

----తెర ముందుకు వచ్చి వారిద్దరు మాట్లాడిన దాని సారాంశం ఏమిటంటే యుద్దోన్మాది అమెరికాకు భారత్ ఇక అధికారిక జూనియర్ భాగస్వామిగా మారిపోయింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అమెరికా చేపట్టే ఆపరేషన్స్ లో భారత్ భాగస్వామి కాబోతోంది. తద్వారా తన చేతికి రక్తం అంటించుకునే పని భారత్ చేయబోతోంది. గణతంత్ర దినోత్సవం నాడు దేశానికి అతిథిగా ఆహ్వానించి, సార్వభౌమాధికార దేశాలను కూల్చే పనిలో అమెరికాకు తోడుగా నిలబడేందుకు అంగీకరించడం ప్రపంచానికే రాంగ్ సిగ్నల్. అణు పరిహారం, డిఫెన్స్ రంగాల్లో కుదిరిన ఒప్పందాల వివరాలు దేశ ప్రజానీకానికి తెలియాల్సి ఉంది. ఎందుకంటే అవి దేశ ప్రజల ప్రాణాల భద్రతతో ముడిపడిన అంశాలు కాబట్టి.. అయితే వీటిని తెరవెనుక దాచి పెట్టారు. మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అనేక అగ్రీమెంట్లు ఈ రెండు రోజుల్లో కుదరబోతున్నాయి. ఈ మేరకు ఓ ప్రత్యేక వ్యవస్థ కూడా ఏర్పాటు కాబోతోంది. ఇప్పటి వరకున్న పరిణామాలు, ఇప్పుడున్న దూకుడు చూస్తుంటే ఇవి  మన దేశ ప్రజానీకం ప్రాణాలు, వారి ఆస్తులకు ఎలాంటి రక్షణను హామీనిచ్చేట్లు కనిపించడం లేదు. 


ఒబామా- మోడీ ప్రసంగంలో వచ్చిన అంశాలు - అర్థం చేసుకోవాల్సిన కోణం...


1. అణు ఒప్పందం అడుగు ముందుకు వేయబోతోంది. పిఎంఓ సోర్సు ప్రకారం ఇక ఇష్యూస్ ఏమీ లేవు కేవలం కాంట్రాక్టులు మాత్రమే మిగిలాయట.. ఇదే రెండు దేశాల మధ్య సంబంధాలకు సెంటర్ పీస్ గా ఉంది. చట్టం, న్యాయవ్యవస్థ, కమర్షియల్ వయబిలిటీ వంటి వాటన్నింటికీ లోబడి ఈ డీల్ ముందుకు వెళ్ల బోతోందని మోడీ చెప్పాడు. దీనర్థం ఏంటి? వీరిద్దరు అణు పరిహారం గురించి మాట్లాడలేదు. పిఎంఓ మాత్రం ఏ ఇష్యూస్ లేవంటోంది. అంటే వాళ్లు అణు పరిహారం ఇవ్వడానికి ఓకే అన్నారా? లేదా భారత్ నే ఒప్పంచారా? ట్రాకింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాలి.

2. ఇన్నాళ్లూ అంతర్జాతీయ సామ్రాజ్యవాద పూరిత యుద్ధాలకు భారత్ దూరంగా ఉంది. ఇప్పుడు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఆసియా, పసిఫిక్ మహా సముద్రాల్లో భారత్ సహకరించబోతోందని మోడీ చెప్పారు. దీనర్థం ఏమిటి? మన సైన్యం ఇతర దేశాలపై దాడులకు వెళ్లబోతోందా? అమెరికా చేసే రక్తపాత క్రీడలో మన దేశం పాలుపంచుకోబోతోందా? శాంతి కాముక దేశం, అందులోని దేశ ప్రజానీకానికి వాస్తవాలు తెలియాలి.

3. అమెరికాకు జూనియర్ భాగస్వామిగా మారినందుకు సెక్యురిటీ కౌన్సిల్ లో శాశ్వత సభ్యత్వం ఇస్తానని చెప్పిందా? అదే అయితే మన దేశ పాలకులు తప్పు చేసినట్లే లెక్క.. మారిన ప్రపంచ నిర్మాణాన్ని అనుసరించి భద్రతా కౌన్సిల్ ను విస్తరించాలన్నది డిమాండ్ గా ఉంది. ఆ డిమాండ్ లో భారత్ కు కచ్చితంగా శాశ్వత సభ్యత్వం దక్కాలి. అది ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు. లేదా ఇదో ఎర అంశంగా మారకూడదు. పై రెండు పాయింట్లు చూసినప్పుడు అమెరికా చెప్పినట్లు వినడం ద్వారా దీనిని సాధించుకున్నామనే భావన కలుగుతోంది. ఇది యావత్తు ప్రపంచానికే నష్టం.

4. పర్యావరణ ఒప్పందానికి డెడ్ లాక్ ఇన్నాళ్లు వేస్తూ వచ్చింది ఎవరు? ధనిక దేశాలు అందులోనూ ముఖ్యంగా అమెరికా... గత రెండు సమావేశాల్లో అమెరికా మెడలు వంచేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే భారత పాలకులు వేసిన అడుగులు అనుమానాలు పెంచేవిగా ఉన్నాయి. దీనిని అర్థం చేసుకోవాలంటే ఈ అంశానికి సంబంధించిన రెండు విషయాలను అర్థం చేసుకోవాలి. అమెరికా తన కాలుష్య ఉద్ఘారాలను 2050 నాటికి గతంలో ప్రకటించిన మేరకు తగ్గించాల్సి ఉంటుంది. అయితే మూడో ప్రపంచ దేశాలు ముందుగా తగ్గించాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. దీనిని కంపల్సరీ చేయాలని చెబుతోంది. అంతేకాదు ఇన్నాళ్లూ ఈ భూమి మీదకు కాలుష్యాన్ని వదిలిన అమెరికా దానికి నష్ట పరిహారంగా పచ్చదనాన్ని పెంచేందుకు నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. దానిని కూడా తప్పించుకోవాలని చూసింది. ఈ అంశాలపై అమెరికా, భారత్ వైఖరులేంటో ప్రపంచానికి తెలియాలి. భావి భారతానికి, లేదా భావి ప్రపంచానికి ఈ రెండు దేశాలు న్యాయ, సమంజస మార్గాన్ని సూచిస్తున్నాయా? లేదంటే అమెరికా ఆడమన్నట్లు భారత్ ఆడబోతోందా? చూడాల్సి ఉంది.

5. టెర్రరిజం గురించి... టెర్రరిజాన్ని అంతమొందించడానికి అన్ని దేశాలు ప్రయత్నించాలి. అందులో అనుమానం లేదు. అయితే దాని పేరిట భద్రతా అంశాలను అమెరికా వాడికి అప్పచేప్పే ప్రయత్నం జరుగుతోంది. ఇద్దరు దేశాధినేతల మధ్య హాట్ లైన్లు ఉండొచ్చు. సంబంధాలు అలాగే ఉండాలి. సెక్యూరిటీ చీఫ్ ల మధ్య సైతం హాట్ లైన్లు ఉంటాయట. ఇరువురు తమ దేశ భద్రతకు సంబంధించిన సమాచారం ఇచ్చి పుచ్చుకుంటారట. ఇది కూడా మంచిదే. భారత, అమెరికా సైన్యాలు (నావీ, ఎయిర్, పదాతిదళం) సంయుక్త విన్యాసాలు చేస్తాయని, వీటి మధ్య కూడా సంబంధాలు ఉంటాయని చెబుతున్నారు. దీన్నెలా చూడాలి? జి7 దేశాల్లో ఉన్న జర్మనీ పెసిడెంట్ మెర్కల్ మీదనే నిఘా వేసిన చరిత్ర అమెరికాది. ఈ రోజు ప్రపంచంలో ఉన్న సార్వభౌమాధికార దేశాలను తన వ్యాపార ప్రయోజనాలకోసం కబళిస్తున్నది అమెరికా. నిన్నటి దాకా దోస్తుగా ఉండి, అమెరికా చెప్పినట్లు ఆడకపోతే ప్రభుత్వాలను, దాని అధినేతలను ఆయా దేశాల్లో సంక్షోభాలు సృష్టించి కూల్చేస్తున్నది అమెరికా. ఇప్పుడు టెర్రరిజం సాకుతో భారత్ చేస్తున్న పని మన భద్రతను అమెరికా చేతిలో పెడుతోంది. భవిష్యత్తును చూస్తానంటోంది. మనం గతాన్ని కూడా చూడాలని చెప్పాలి.

6. కెమిస్ర్టీ.. ఫిజిక్స్ ల గురించి... : ఇద్దరు దేశాధినేతలు తెర వెనుక ఏం మాట్లాడుకుంటారో అది ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఇద్దరు దేశాధినేతలు ఇరు దేశాలకు ప్రతినిధులు. ప్రజలు వాళ్లను ఎన్నుకున్నారు. కెమిస్ర్టీ, ఫిజిక్సులు ఏమైనా ఉంటే అది వ్యక్తిగతంగా ఉంచుకోవాలి. మొన్నటి దాకా గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో విసానే ఇవ్వనిరాకరించిన దశ నుంచి ఇంత వేగంగా కెమిస్ర్టీ ఎలా డెవలప్ అయ్యింది? దీనికి గల కారణాలేంటి? ప్రజలకు తెలియాలి. భారత్ ను తక్షణం జూనియర్ భాగస్వామిగా చేసుకోవాలన్న తహతహనా? లేదా అమెరికాకు తక్షణం జూనియర్ భాగస్వామిగా మారిపోవాలన్న భారత్ తహతహనా? ఈ తహతహ వల్ల ఏర్పడ్డ కెమిస్ర్టీ వల్ల లాభపడేదెవరు? ఇది కూడా ప్రజలకు తెలియాలి.

7. దౌత్యపరమైన అంశాలు ప్రపంచ శాంతి, ప్రపంచ కాలుష్యం తదితర అంశాలపై ప్రభావం చూపుతాయి. మన దేశం మీద నేరుగా ప్రభావం చూపేవి వేరే అంశాలున్నాయి. దీనికోసం ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేస్తారట. ఇందులో ఎవరుంటారో తెలుసా? ఆయా దేశాల్లోని బడా కార్పొరేట్లు, వీరికి పర్మీషన్లను సమకూర్చే ఇరు దేశాల అధికారులు. ఇరు దేశాల్లో వీరెంచుకున్న రంగాల్లో వ్యాపారాలు చేయాలంటే అంతకు ముందు ప్రభుత్వ రక్షణలో ఉన్న అనేక రంగాలు, సంస్థలు మార్కెట్ పరం చేయాలి. దీనర్థం ఏమిటి? ప్రయివేటీకరించాలి. ప్రభుత్వం తప్పుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకుద్దేశించిన కనీస రక్షణలు తీసేయాలి. వీరి వ్యాపారం నిరాటంకంగా సాగాలంటే ఇవి తప్పవు. ఇవి అనివార్యం అవుతాయి.  దీనివల్ల ఏం జరుగుతుంది. ఆర్థికంగా చిన్న, మధ్య తరహా వ్యాపారులు, పరిశ్రమలు, ఇప్పటికే సంక్షోభంలో ఉన్న మన జనం మరింత చితికిపోతారు. ఇరు దేశాల్లో ఉన్న బడా కొర్పరేట్లు లాభ పడతారు. వారి వద్ద సంపద మరింత పోగుపడుతుంది.

2 comments:

  1. How we r going to make them to disclose about all these issues?

    ReplyDelete
  2. How we r going to make them to disclose about all these issues?

    ReplyDelete