Thursday 1 January 2015

`పరిమితి` లేకుండా ఖాళీ భూములను క్రమబద్దీకరించడం దుర్మార్గం - సిపిఐ(ఎం)

(అఖిల పక్షంలో  మాట్లాడి చేస్తున్నామని చెప్పిన సిఎం కెసిఆర్, అందుకు భిన్నంగా ఏకపక్షంగా జిఓ నెం.59ని విడుదల చేశారు. స్థలం ఎంత ఉన్నదానితో సంబంధం లేకుండా ఖాళీ భూములన్నింటినీ క్రమబద్దీకరించాలన్నది దీని సారాంశం. ఇదే జరిగితే ప్రభుత్వ భూములన్నీ  అన్యా క్రాంతం అయిపోతాయి. పేదలకు, ప్రజల అవసరాలకు సెంటు భూమి కూడా మిగలదు. అందుకే ఈ జిఓను తక్షణం రద్దు చేయాలని సిపిఐ(ఎం) డిమాండ్ చేస్తోంది.)


          తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ సీలింగ్‌ భూములను క్రమబద్దీకరిస్తూ జి.ఓ. 58,59 లను జారీ చేసింది. అనేక అక్రమాలకు దారితీసేలా ఉన్న జీవో 59ను వెంటనే రద్దు చేయాలని సిపిఐ(యం) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

            అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీల సూచనలకనుగుణంగానే ఈ జి.ఓ.లు జారీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించడం సరికాదు. ''ఆక్రమిత భూముల క్రమబద్దీకరణ ఎప్పటికప్పుడు జీవోల ద్వారా చేయడం సరికాదని, ఇందుకు ఒక చట్టం తీసుకురావాలని సిపిఐ(యం) పార్టీ పక్షాన చేసిన సూచనను ప్రభుత్వం పాటించలేదు. పేదలకు 125 గజాలు ఉచితంగా క్రమబద్దీకరించడంతో పాటు, రిజిస్ట్రేషన్‌ కూడా చేయాలని కోరుతున్నాం.
         
         క్రమబద్దీకరణ కోసం 20 రోజుల్లోనే దరఖాస్తులు చేసుకోవాలనే నిబంధన కూడా పేదలకు అసాధ్యం. పేదల దరఖాస్తులకు సమయాన్ని పెంచి క్రమబద్దీకరణ కోసం బస్తీమేళాలు నిర్వహించాలని, అధికారులే బాధ్యత వహించేలా తగు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నాం.

          అఖిలపక్ష సమావేశంలో ఖాళీ స్థలాలను ఎటువంటి పరిస్థితుల్లో క్రమబద్దీకరించకూడదని నిర్ణయం జరిగినప్పటికీి, దానికి భిన్నంగా ప్రభుత్వం జి.ఓ. 59ని తెచ్చింది. ఈ జి.ఓ.లోని సెక్షన్‌ 2(5)లో వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు అపరిమితంగా భూములు క్రమబద్దీకరణకు అవకాశం కల్పించింది. 2(6) సెక్షన్‌లో ''భవనం ఉండి దాని ప్రక్కన స్వాధీనంలో ఉన్న భూమిని క్రమబద్దీకరిస్తాం'' అనే అంశాన్ని పేర్కొన్నది. దీని వలన ఖాళీ భూములను అపరిమితంగా ఎన్ని ఎకరాలైన సరే క్రమబద్దీకరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. గతంలోని జి.ఓ. లు 166, 747 లలో కొంత పరిమితి విధించినప్పటికీ అనేక అక్రమాలు జరిగాయి. ప్రస్తుత జి.ఓ.లో ఎలాంటి పరిమితులు విధించకపోవడం భారీ భూ కబ్జాలకు పచ్చజెండా చూపినట్లయింది.

             పేదల కోసం జారీ చేసిన జి.ఓ. 58లో ఖాళీ స్థలాలను క్రమబద్దీకరించబోమని ప్రత్యేకంగా ప్రకటించిన ప్రభుత్వం, జి.ఓ. 59 లో ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం ప్రభుత్వం భూ కబ్జాలకు అనుకూలంగా తప్పుడు సంకేతాలు ఇచ్చింది. జి.ఓ. 59 యధాతథంగా అమలైతే భవిష్యత్‌లో ప్రజావసరాల కోసం ప్రభుత్వ భూములు మిగిలే పరిస్థితే ఉండదు. క్రమబద్దీకణ పూర్తిగా ఆర్‌.డి.ఓ. స్థాయి అధికారులకు బాధ్యత అప్పచెప్పడం కూడా సమంజసం కాదు. ప్రభుత్వ స్థాయిలో ప్రధానంగా ఈ ప్రక్రియ జరగాలి. అనేక అక్రమాలకు దారితీసేలా ఉన్న జీవో 59ను వెంటనే రద్దు చేయాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

No comments:

Post a Comment