Tuesday, 20 January 2015

పది రోజుల్లో రాజకీయ ముసాయిదా - ప్రెస్ మీట్లో ప్రకాష్ కారత్ వెల్లడి


              సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు హైదరాబాదులో జరుగుతున్నాయి. మహాసభల్లో ఆమోదించాల్సిన రాజకీయ ముసాయిదాను ఖరారు చేయడం,  రాజకీయ ఎత్తుగడల పంథాను సమీక్షించడం ప్రధానాంశాలుగా ఉండడంతో ఈ సమావేశాలు  అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల్లో రెండో రోజైన మంగళవారం నాడు (జనవరి20, 2015) ప్రకాష్ కారత్ మీడియాతో మాట్లాడారు. వాటి వివరాలివి.. (ప్రెస్ మీట్లో ప్రకాష్ కరత్ పూర్తి ఉపన్యాసం కోసం యూట్యూబ్ వీడియో చూడండి..)



1. రాజకీయ ఎత్తుగడల పంథా
---- రాజకీయ ఎత్తుగడల పంథా మీద ముసాయిదా సమీక్షా నివేదికను కేంద్ర కమిటీ చర్చకు  చేపట్టింది. రాజకీయ ఎత్తుగడల పంథాను అనుసరించి చేపట్టిన గత కార్యక్రమాల అనుభవాలు, పార్టీ ప్రభావాన్ని బలోపేతం చేయడానికి, విస్తరించడంలో దాని పాత్ర, వామపక్ష ప్రజాతంత్ర పోరాటాలను ముందుకు తీసుకుపోవడంలో దాని ప్రభావం గురించి ఈ నివేదికలో ఉంది.
--- ప్రస్తుతం ఈ నివేదికను కేంద్ర కమిటీ చర్చిస్తోంది. నయా ఉదారవాద అమలు నేపథ్యంలో వివిధ వర్గాల జీవిత విధానంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేసేందుకు గత ఏడాది జూన్ లో మూడు అధ్యయన బృందాలను పార్టీ నియమించింది. కార్మికవర్గం, పట్టణ మధ్యతరగతి, రైతాంగంపై ఈ అధ్యయన బృందాలు తమ అధ్యయనాన్ని పూర్తి చేసి వాటి నివేదికలను  కేంద్ర కమిటీకి సమర్పించాయి.
---- మార్చిలో జరగబోయే కేంద్ర కమిటీ సమావేశాల్లో రాజకీయ ఎత్తుగడల పంథాపై చర్చ జరగనుంది. ఆ తరువాత ముసాయిదా విడుదల అవుతుంది.

2. రాజకీయ తీర్మానం ముసాయిదా
---- వైజాగ్ లో జరిగే 21వ జాతీయ మహాసభల్లో ప్రవేశపెట్టాల్సిన రాజకీయ తీర్మానం  ముసాయిదాను కేంద్ర కమిటీ చర్చించింది. సమావేశాలు పూర్తయ్యేలోపు ఈ ముసాయిదా నివేదికను కేంద్ర కమిటీ ఆమోదిస్తుంది. ఆ తరువాత పది రోజుల్లోపు దేశ వ్యాప్తంగా చర్చ కోసం దీనిని విడుదల చేస్తుంది.
---- ప్రస్తుతం దేశంలో బిజెపి అధికారంలో ఉంది. దీంతో మితవాద శక్తులకు  బలం చేకూరింది. దీంతో ఆర్ఎస్ఎస్ నాయకత్వంలోని హిందూ మతోన్మాద శక్తులు తమ మతోన్మాద ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడంతో పాటు, పూర్తి స్థాయిలో నయా ఉదారవాద విధానాలను అమలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి దేశంలో నిరంకుశత్వం పెరిగేందుకు దారి తీస్తుంది. రాజకీయ తీర్మానం ముసాయిదా ఈ ద్వంద్వ ప్రమాదాలను  ఎదుర్కొనేందుకు పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో వివరిస్తుంది.

3. ప్రస్తుత పరిస్థితులు - పార్టీ వైఖరి
--- ఉపాధి హామీ పథకం, ఆరోగ్యం, విద్యారంగాల బడ్జెట్లలో కోతలను విధించడాన్ని  కేంద్ర కమిటీ త్రీవంగా ఖండిస్తోంది.
--- అంతర్జాతీయంగా చమురు ధరలు 60శాతం మేర తగ్గినప్పటికీ, దేశ ప్రజానీకానికి ఉపశమనం కల్పించకుండా, నాలుగు సార్లు ఎక్సయిజ్ డ్యూటీ పెంచడాన్ని కేంద్ర కమిటీ త్రీవంగా  విమర్శించింది.
--- రైతుల హక్కుల మీద దాడి చేసేందుకు, భూ సేకరణ  చట్టాన్ని  నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా విస్తృత పోరాటాలు నిర్వహించాలని  కేంద్ర కమిటీ తీర్మానించింది.
--- హిందూత్వ శక్తుల కార్యక్రమాలను సైతం కేంద్ర కమిటీ త్రీవంగా ఖండించింది. మత మార్పిడి, మైనార్టీలు లక్ష్యంగా దాడులు, కళాకారులు, పెరుమళ్ మురుగన్ వంటి రచయితలపై దాడులతో బహుముఖంగా మతోన్మాద ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు అవి ప్రయత్నిస్తున్నాయి. మన గణతంత్ర దేశ లౌకిక, ప్రజాస్వామిక మూలాలకు ప్రమాదకరంగా ఉన్న ఇలాంటి కార్యక్రమాలను, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఐక్యంగా ఎదుర్కోవాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.

No comments:

Post a Comment