---- ఒబామా గో బ్యాక్ అని వామపక్షాలు పిలుపునిచ్చాయి. 24న నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. వామపక్షాలు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాల మీద అనేక మందికి అనేక అనుమానాలున్నాయి.
----- ఒబామా గో బ్యాక్ అంటూ సిపిఐ(ఎం) పార్టీ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు `ఆలోచన లోచన` అనే గ్రూపులో షేర్ చేసిన పోస్టుపై ఈ అనుమానాలతోనే ఓ చర్చ ప్రారంభమైంది. వీటిని నివృత్తి చేసే దిశగా చర్చ సాగింది.
----ఇది మొత్తం చదివిన తరువాత కూడా అనుమానాలు ఇంకా మిగిలి ఉండొచ్చు.. వాటిని మనస్సులో ఉంచుకోకుండా చర్చకు పెట్టడం ఉపయోగం.
------ఇదీ జవాబు--- ఒబామా గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వస్తున్నారు. గణతంత్ర దినోత్సవం అంటే దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చి ప్రజలకు హక్కులు దఖలుపడిన రోజు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలపై దాడులు జరిపి వారి హక్కులను కబళిస్తున్న అమెరికా అధ్యక్షుడిని గణతంత్ర ఉత్సవానికి అతిథిగా ఆహ్వానించడం సబబు కాదు. ఆయన కారణంగానే ఇరాక్, లిబియా వంటి దేశాల్లో యుద్ధ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. మరోవైపు సిరియాలో ప్రజలెన్నుకున్న స్వతంత్ర ప్రభుత్వాన్ని కూల దోశాడు. ఇలా ప్రపంచ దేశాల సార్వభౌమాధికారాన్ని ధ్వంసం చేసే పనిలో బిజీగా ఉన్న అమెరికా అధ్యక్షుడు మన దేశ గణతంత్ర దినోత్సవాలకు హాజరు కావడం ద్వారా ప్రపంచానికే రాంగ్ సిగ్నల్ ఇచ్చినట్లవుతుంది.
----- రెండో కారణం---- ఒబామా కేవలం అతిథిగా వచ్చినా పై కారణం చేత మనం వ్యతిరేకించాలి. అయితే ఆయన కేవలం అతిథిగా రావడం లేదు. ఆయన భారీ ఎజెండాతో వస్తున్నారు. భారతదేశాన్ని తన రక్షణ వ్యూహంలో భాగస్వామిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే మన సైన్యంలోనూ అమెరికా జోక్యం పెరుగుతోంది. అణు ప్రమాదాల నష్ట పరిహారాన్ని ఎత్తివేసేందుకు వీలుగా ఒక ఒప్పందం జరగబోతోంది. జపాన్ లో ఫుకుషిమా ప్రమాదాన్ని చూశాం. అలాంటి ప్రమాదాల వల్ల భారతీయులకు నష్టం జరిగితే నష్ట పరిహారం భారాన్నుంచి అమెరికన్ కంపెనీలను తప్పించే ఒప్పందం అది. యూనియన్ కార్బైడ్ విషయంలో మనం ఇప్పటికే నష్టపోయాం. ఇకనుంచి కనీసం నష్ట పరిహారం కూడా అడిగేందుకు వీలు లేకుండా పోనుంది.
-----మూడో కారణం--- ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో అమెరికన్ కంపెనీలకు, దేశీయ బడా పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చే అనేక ఒప్పందాల కోసం మోడీ ప్రభుత్వం రాత్రింబవళ్లు అహర్నిశలు కృషి చేస్తోంది. ఇందుకోసం ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టబోతోంది. దీనిలో భాగంగానే దేశ ప్రజలెనుకున్న పార్లమెంటుతో సంబంధం లేకుండా, అక్కడ చర్చించకుండా ఆర్డినెన్సుల రూపంలో చట్టాలను మార్పుచేస్తోంది. రైతన్నలను భూములనుంచి గెంటివేసే భూ సేకరణ చట్టం సవరణ ఆర్డినెన్స్ ఇందుకు ఒక ఉదాహరణ...
--- ప్రపంచానికి, దేశానికి, దేశ ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించే దిశగా ఒబామా పర్యటన ఉండబోతోంది. అందుకే వామపక్షాలు ఈ పర్యటనను వ్యతిరేకిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 24న నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాయి.
No comments:
Post a Comment