Thursday, 22 January 2015

'ఘర్‌వాపసీ' రాజ్యాంగంపై దాడే... ... ఈ వ్యవహారంపై మోడీ మౌనం వీడాలి : బృందాకరత్



                    ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంస్థలు ఘర్‌వాపసీ కార్యక్రమానికి హిందూత్వ భావంతో సంబంధాలున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్‌ విమర్శించారు. ఈ వ్యవహారంలో మోడీ మౌనం వీడకపోవడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. భారత్‌ ప్రజాస్వామిక దేశమని, ప్రజలు కోరుకున్న మతాన్ని స్వీకరించేందుకు రాజ్యాంగం అనుమతిస్తోందని వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పిలు 'ఘర్‌వాపసీ' పేర చేస్తున్న బలవంతపు మత మార్పిళ్లు రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై, వ్యక్తిగత స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న కేంద్ర కమిటీ సమావేశాల సందర్భంగా బృందా కరత్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు క్లుప్తంగా..
ప్ర: సంఘ్ పరివార్‌ సంస్థలు పునరాగమనం(ఘర్‌వాపసీ) పేరిట చేపడుతున్న కార్యక్రమాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ?
జ: ఘర్‌వాపసీ కార్యక్రమానికి హిందూత్వ భావంతో సంబంధాలున్నాయి. సంఫ్‌ు పరివార్‌ సంస్థలు భారతీయులందరూ హిందువులనీ, భారతదేశం కేవలం హిందువలదంటూ ప్రచారం చేస్తున్నారు. ఇది చారిత్రికంగా అవాస్తవం. దేశంలో వివిధ ప్రాంతాల్లో విభిన్న మతాలకు, కులాలకు చెందిన ప్రజలు జీవిస్తున్నారు. దేశంలో చాలా ప్రాంతాల్లో గిరిజనులు నివసిస్తున్నారు. వారికి అసలు హిందూ మతంతో సంబంధమే లేదు. కానీ బిజెపి నేతలు మాత్రం వారంతా నిజమైన హిందూవలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే ఘర్‌వాపపీ కార్యక్రమానికి హిందూత్వభావంతో సంబంధముంది. అయితే బిజెపి నేతలు మాత్రం ఘర్‌వాపపీని, బలవంతపు మత మార్పిళ్లను వేరు వేరుగా అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నారు. ఘర్‌వాపపీ మత మార్పిడే కాదని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే బిజెపి వంచన నిజస్వరూపం. 
ప్ర: బిజెపి నేతలు మాత్రం మతమార్పిళ్ల వ్యతిరేక చట్టం తీసుకొస్తాం ప్రతిపక్షాలు సహకరించాలంటున్నారు. దీని వెనుక ఉన్న మర్మమేమిటి?
జ : ఏ మతానికి సంబంధించిన మత మార్పిళ్ల వ్యతిరేక చట్టానికి అయినా సిపిఎం వ్యతిరేకం. ఒకవేళ ఈ చట్టం కనుక తీసుకొస్తే హిందూ మతంలో వివక్షను ఎదుర్కొన్న ఒక దళితుడు అంబేద్కర్‌ మాదిరిగా బౌద్ధమతం స్వీకరించే అవకాశం కోల్పోతాడు. ఒకవేళ అంబేద్కర్‌ ప్రస్తుతం జీవించి ఉంటే ఆయన బౌద్ధమతం స్వీకరించేందుకు జిల్లా కలెక్టర్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియార్‌లో జరుగుతున్నవి ఇవే ఘటనలు కదా..! హిందూ యువతి ముస్లిం యువకుడిని వివాహం చేసుకుందని, ఇది మత మార్పిళ్ల వ్యతిరేక చట్టానికి విరుద్ధమంటూ ఆమెను భర్త నుంచి వేరు చేశారు. ఆమె ఇప్పటికీ భర్తకు దూరంగా ఆమె బంధువుల ఇంట్లో నివసిస్తోంది. అసలు ఆమె ఎందుకు మతం మారాలి? ఆమె కోరుకున్న మతంలో ఉండడం ఆ యువతి ప్రాథమిక హక్కు. 
ప్ర : బిజెపి పాలిత రాష్ట్రాల్లో చేపడుతున్న తిరోగమన చర్యలేమీ?
జ : బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేక వివాహాల చట్టానికి సవరణలు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా గుజరాత్‌లో ఈ చట్ట సవరణలకు పూనుకుంటున్నారు. ఆ సవరణల ప్రకారం ఇద్దరు వేరు వేరు మతాలకు చెందిన యువతీ యువకులు వివాహం చేసుకుంటే విచారణ పేరిట ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఆ యువతి, యువకుల తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఒకవేళ వారు అంగీకరించినప్పటికీ సంఫ్‌ు పరివార్‌ సంస్థలు మత మార్పిళ్ల వ్యతిరేక చట్టం, ప్రత్యేక వివాహాల సవరణల చట్టంతో ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ రెండు చట్టాలూ యువతుల హక్కులను కాలరాయడమే. మతం మారాలనుకుంటే అది సంబంధిత వ్యక్తుల వ్యక్తిగత వ్యవహారం. ఈ విషయంలో మరొకరికి వివరణివ్వాల్సిన ఆగత్యమేమిటి? 
ప్ర : భజరంగ్‌ దళ్‌, విహెచ్‌పి నేతలు ఇటీవల కాలంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దానిపై మీ వ్యాఖ్య
జ : కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టిన నాటి నుంచి వ్యూహాత్మకంగా బిజెపి నేతలతో పాటు సంఫ్‌ు పరివార్‌ అధినేతలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌తో పాటు బిజెపి నేతలు సాక్షి మహారాజ్‌, ఆదిత్యనాథ్‌, నిరంజన్‌ జ్యోతి తదితర నేతలు వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువులగా మారారు. అయినప్పటికీ మోడీ నోరు మెదపడం లేదు. మొదటగా 'భారతదేశం హిందూవులది' అంటూ మోహన్‌ భగవత్‌ విద్వేషంగా మాట్లాడారు. కానీ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. ఈ వ్యవహారంలో మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నోటీసులు ఎందుకు జారీ చేయడం లేదు. మోడీ భారత రాజ్యాంగాన్ని సంరక్షిస్తారా లేక భగవత్‌ వ్యాఖ్యాలను సమర్థిస్తారా ప్రస్తుతం తేలాల్సిన ప్రశ్న.

No comments:

Post a Comment