Wednesday, 7 January 2015

నిజాంను పొగిడితే నేరం చేసినట్లే..


- చరిత్ర వక్రీకరణకు పునాది వేయొద్దు 
- ముఖ్యమంత్రి కెసిఆర్‌కు 
మేధావుల హెచ్చరిక 
- సిఎం వ్యాఖ్యలను తీవ్రంగా 
ఖండించిన రౌండ్‌టేబుల్‌ సమావేశం
- వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ 

                 తెలంగాణ ప్రజలపై అమానుష మారణకాండకు పాల్పడిన నిజాంను పొగిడితే నేరం చేసినట్లే అవుతుందని పలువురు మేధావులు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సూచించారు. ఆయన్ను కీర్తించటం ద్వారా భూమికోసం, భుక్తికోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, దాని ప్రాధాన్యతను తక్కువ చేసి చూపేందుకు సిఎం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా చరిత్ర వక్రీకరణకు పునాది వేయొద్దని హెచ్చరించారు. కెసిఆర్‌ తక్షణం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. 
                 'నిజాం పాలన-ఒక పరిశీలన' అనే అంశంపై హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం కన్వీనర్‌ జి.రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ...కెసిఆర్‌ చెబుతున్నట్లు నిజాం హయాంలో హైదరాబాద్‌లో జడ్జిఖానా (హైకోర్టు), దవాఖానా (ఉస్మానియా ఆస్పత్రి), ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్మించిన మాట వాస్తవమేనని అన్నారు. ఇదే సమయంలో ఆనాటి తెలంగాణ జిల్లాలు అక్షరాస్యతాశాతంలో చాలా వెనుకబడి ఉన్నాయని తెలిపారు. గ్రామాల్లో ప్రసూతి కేంద్రాలు సైతం లేకపోవటంతో మంగలివారే పురుళ్లు పోసే వారని గుర్తుచేశారు. హైకోర్టు భవనం అద్భుతంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలోని జనానికి ఎక్కడా న్యాయం అందలేదని తెలిపారు. అందువల్ల నిజాం కట్టిన భవనాలు, నిర్మాణాల గురించి కాకుండా ఆనాటి ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా, జీవన ప్రమాణాల గురించి కెసిఆర్‌ మాట్లాడితే బావుంటుందని ఎద్దేవా చేశారు. మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ నిజాం హైదరాబాద్‌ను ఎంత అందంగా తీర్చిదిద్దారనేది ముఖ్యం కాదు, ఆనాటి ప్రజలకు కూడు, గూడు, వస్త్రాలు అందించాడా? లేదా? అనేదే ముఖ్యమని తెలిపారు. పరిపాలనలో అత్యంత ముఖ్యమైన శాంతి భద్రతల పరిరక్షణ అంశాన్ని ఆయన గాలికొదిలేశారని విమర్శించారు. 
               మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నిజాం అండదండలు, ఆదరణ, ఆర్థికసాయం లేకుండానే జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు ప్రజలపై దాష్టీకాన్ని కొనసాగించారా? అని ప్రశ్నించారు. శాసనమండలి సభ్యులు పిజె చంద్రశేఖరావు మాట్లాడుతూ...రాజకీయ అవసరాల నేపథ్యంలోనే కెసిఆర్‌ నిజాంను పొగుడుతున్నారని అభిప్రాయపడ్డారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ముస్లింల ఓట్లను సంపాదించేందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ఈ అవసరం తీరగానే భవిష్యత్‌లో బిజెపికి దగ్గరయ్యేందుకు అవసరమైతే అదే నిజాంను విమర్శిస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షులు డి.నాగయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని సంస్థానాలు భారత్‌లో విలీనమైతే అందుకు విరుద్ధంగా తనను తాను స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్న నిజాం దేశభక్తుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. తెలంగాణలోని హిందువుల పేదరికంతోపాటు ముస్లింల దరిద్రానికీ నిజాం నవాబే కారణమని చెప్పారు. ప్రొఫెసర్‌ భూక్యా భాంగ్యా మాట్లాడుతూ దొరల మద్దతుతోనే ఆనాటి రజాకార్లు ప్రజలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని చెప్పారు. ఈ విషయంలో మొత్తంగా నిజాంనే దోషిని చేయటం సరికాదని అన్నారు. ఈ కోణంలో ఆలోచించి చరిత్రను తిరిగి నిర్వచించాలని కోరారు. సీనియర్‌ పాత్రికేయులు దేవులపల్లి అమర్‌ మాట్లాడుతూ ఆనాటి కాలం నుండి ప్రస్తుతం వరకు పాలకులు పాలకులుగానే వ్యవహరిస్తున్నారని తెలిపారు. అప్పటి నుండి ఇప్పటిదాకా పాలితులు పీడింపబడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి నిజాం పాలనలో నిమ్న కులాలకు ఏం ప్రయోజనం ఒనగూరిందని ప్రశ్నించారు. సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ దేశాన్ని పట్టి పీడించిన బ్రిటీషు వారికి అందరికంటే ఎక్కువ తొత్తుగా వ్యవహరించింది నిజామేనని చెప్పారు. అందువల్ల నిజాంను పొగిడితే బ్రిటీషు వారిని పొగిడినట్లేనని విమర్శించారు. సమావేశంలో వ్యవసాయ శాస్త్రవేత్త అరిబండి ప్రసాదరావు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌, యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు నరహరి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment