Wednesday, 21 January 2015

ప్లాస్టిక్ సర్జరీ ప్రాచీన కాలంలోనే ఉందా?





 ప్లాస్టిక్‌ సర్జరీ, ప్రత్యుత్పత్తి, జన్యు శాస్త్రపరిజ్ఞానం మన ప్రాచీన వైద్య విధానంలో అంతర్భాగాలని ఈమధ్య ప్రధానమంత్రి చెప్పగా విన్నాను. అది వాస్తవమేనా? - ఎ.పల్లవి, మె డికల్‌ విద్యార్థిని ఉస్మానియా వైద్య కళాశాల, హైదారాబాద్‌

ఇదీ జవాబు : ప్రధాన మంత్రి దేశానికి దిశానిర్దేశాన్ని యిచ్చే కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి . రాజ్యంగాన్ని తూచా తప్పకుండా అన్ని సందర్భాల్లో అన్వయించవలసిన ఆవశ్యకత ఆ పదవికి ఉంది. వ్యక్తిగత నమ్మకాలను సమావేశాల్లో సైన్సుగా ప్రకటించడం రెండు విధాలుగా నష్టం. రాజ్యాంగం చెప్పిన శాస్త్రీయ దృక్పథం పెంపుదలకు, ప్రశ్నించే తత్వానికి ఈ ధోరణి సవాలు విసురుతుంది. మరో పక్క అత్యంత హుందాగా ఆసక్తికరంగా కాల్పనికతను, సాహిత్య ధోరణిని నింపుకున్న పురాణగ్రంథాల్ని కూడా కలుషితం చేయడమవుతుంది. ఒక వేళ ఫలానా పురాణఘట్టం సైన్సు అని వాదించినా, ప్రకటించినా, ఫలానా పురాణపురుషునికి పురాణాల్లో వివరించినట్టుగానే వాస్తవచరిత్రలో అంర్భాగమైన వ్యక్తిగా పేర్కొన్నా సైన్స్‌ వేసే అన్ని పశ్నలకు, శాస్త్రీయ సమాధానాలు ఇవ్వగలగాలి. చరిత్ర కూడా ఒక విజ్ఞానశాస్త్రం. అది వాస్తవమైన తరతరాల మానవ సమాజగమనానికి ఒక డైరీ లాంటిది. అందులో కాల్పనికతకు, మిథ్యావాదానికి, స్వీయ మానసిక వికృతులకు అద్దంపట్టే సొంత వాఖ్యానాలకు తావులేదు. 
------- ప్రాచీనకాలంలోనే భారతదేశంలో ప్లాస్టిక్‌ సర్జరీ ఉండేదని చెప్పడానికి వినాయకుడికి ఏనుగు తలను అతికించడమే నిదర్శనమని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే కర్ణుడు కుంతీదేవి గర్భంనుంచి కాకుండా బయట పరీక్షానాళికలో పుట్టినట్టు చెబుతూ అది ఆనాటి ప్రత్యుత్పత్తి జన్యు సాంకేతిక పరిజ్ఞానా(Reproductive Genetics)నికి తార్కాణమని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ సర్జరీ, ప్రత్యుత్పత్తి జన్యు సాంకేతిక పరిజ్ఞానం విజ్ఞాన శాస్త్రపుటంశాలు.
------- కాబట్టి ఎవరైనా వినాయకుడి గజాననాన్ని, కర్ణుడు తదితరుల అద్భుత జన్మవృత్తాంతాన్ని విజ్ఞానశాస్త్ర పరిధిలోకి లేదా కోవలోకి తీసుకొస్తే విజ్ఞానశాస్త్ర అభివృద్ధికి చెందిన అత్యంత కీలకమైన ప్రశ్నలన్నింటికీ శాస్త్రీయవివరణ ఇవ్వగలగాలి.
------- ''ప్రాచీన కాలంలో ఒక వ్యక్తి బొగ్గును బంగారంగా మార్చారండీ'' అని ఎవరైనా అంటే అది అశాస్త్రీయం కాదు. ఎందుకంటే, ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రకారం ఇందుకు వీలుంది. కానీ ఆ వ్యక్తి క్రీస్తు పూర్వమే మనదేశంలో సైన్సు అంతటి అభివృద్ధి చెందిందని అంటే మాత్రం విజ్ఞానశాస్త్ర కోణంనుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పగలగాలి. అలా బొగ్గును బంగారంగా మార్చడం సూత్రరీత్యా (in principle)సాధ్యమే. కేంద్రక సంశ్లేషణ ప్రక్రియ (Nuclear Fusion) ప్రకారం ఒక గ్రాము బొగ్గును బంగారంగా మార్చినప్పుడు ఒక గ్రాముకన్నా కొంచెం తక్కువగా బంగారం వస్తుంది. అయితే ఆ ప్రక్రియను సాధించాలంటే బొగ్గును కొన్ని లక్షల సెంటీగ్రేడ్‌ డిగ్రీల ఉష్ణోగ్రతకు తీసుకువెళ్లాలి. సాధారణ పీడనం కన్నా కొన్ని వేల రెట్ల జడ వాతావరణాన్ని (inert atmosphere)లేదా శూన్యాన్ని (vaccum) ఏర్పరచాలి. ఒక గ్రాము బొగ్గు బంగారంగా మారినప్పుడు కొన్ని కోట్ల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉండేలా ఉష్ణశక్తి పుడుతుంది. అంత విపరీతమైన ఉష్ణోగ్రతను నిభాయించ(manage)గలిగిన సాంకేతిక పద్ధతులు, పరికరాలు నేర్పరితనం అత్యవసరం. ప్రాచీనకాలంలోనే రాతి పనిముట్లు నూనె దీపాలు వాడే దానిని ఎలా సాధించగలిగారో చెప్పాలి. కాబట్టి యథాలాపంగా (Just like that) ప్రాచీన కాలంలో బొగ్గును బంగారంగా చేసే పరిజ్ఞానం ఉందంటే సరిపోదు. అది సాకారం కావడానికి అవసరమైన వ్యవస్థ ఎలా సమకూరిందో చెప్పాలి. అలాగే, ''నేలను తవ్వి బావుల్లోంచి నీటిని తోడేవారండీ' అంటే సరిపోదు. ఎందుకంటే, నేలను తవ్వడానికి మనిషి చేతులు, బావిలోంచి నీళ్లు తోడడానికి దోసిళ్లు సరిపోవని మనకు తెలుసు. కనుక, పలుగులు, పారలు, బొక్కెనలు వాడినట్టు ఒప్పుకోవాలి. ''అలాంటివేవీ లేవండీ. అయినా బావులు తవ్వి, నీళ్లు తోడారండీ. మనకు అప్పటికే భూగర్భజలాల్ని వాడే జలనియంత్రణవిజ్ఞానం( Hydrology)తెలుసండీ''అంటే, అది విజ్ఞానశాస్త్రపరీక్షకు నిలబడదు. దేనితో నేలను తవ్వారో చెప్పాలి. గురుత్వాకర్షణబలానికి వ్యతిరేకంగా ఏ సాధనంతో బావిలోంచి నీటిని తోడారో కూడా చెప్పాలి. 
--------- అలాగే, మనిషి శరీరానికి ఏనుగు తల సరిపోతుందా? మనిషి రక్తపు గ్రూపుతో సరిపోయేలా ఏనుగు రక్తపు గ్రూపు ఉంటుందా? ఏనుగు మెదడు మనిషి శరీరభాగాల్ని, నోటి(భాష)ను పనిచేయించగలదా? వినాయకుడు గజాననుడు అయ్యాక మాట్లాడడం మానేశాడా? ఒకవేళ గజాననుడు అయ్యాక కూడా మాట్లాడాడంటే, మాటకు కారణం మెదడు జారీచేసే సంకేతాలే కాబట్టి, నోటితో సహా ఏనుగు తలను మొత్తాన్ని వినాయకుడికి అతికించారు కాబట్టి ఏనుగు కూడా మనిషిలానే మాట్లాడగలిగి ఉండాలి కదా? మనిషి గుండెనుంచి, ఊపిరితిత్తులనుంచి, వెన్నుపూసనుంచి బయలుదేరే అన్నివిధాలైన రక్తనాళాలు, నాడీతంత్రులు ఏనుగులోని రక్తనాళాలకు, నాడీతంత్రులకు అమరేలా ఉన్నాయా? ఆ రోజుల్లోనే రక్తగ్రూపుల గురించి కూడా తెలుసా? మరి రక్తగ్రూపులను ఎలా పరీక్షించేవారు? ఎలా తీర్మానించేవారు?-మొదలైన అనేక ప్రశ్నలు ప్రధానమంత్రిగారి వ్యాఖ్యతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నాయి. వీటిని ప్లాస్లిక్‌ సర్జరీ ప్రక్రియనుంచి వేరుచేయలేము. సైన్సులో కొంత సైన్సు, కొంత కాల్పనికత ఉండడానికి అవకాశంలేదు. మనిషికి ఏనుగు తలను అతికించడం అప్పుడు సాధ్యమైతే ఇప్పుడూ కావాలి. మనిషి, ఏనుగుల శరీరనిర్మాణం(anatomy)గురించి అప్పటికంటె ఇప్పుడు వివరంగా తెలుసు. కాబట్టి మనిషి మొండేనికి జంతువు తలను మరింత సులభంగా నేడు అతికించగలిగి ఉండాలి. కనీసం, ఓ జంతువు తల నరికి, వెంటనే అదే తలను ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా అతికించి బతికించగలమా? 
----------- అలాగే, కర్ణుడికి సంబంధించి కూడా ఎన్నో ప్రశ్నలకు శాస్త్రీయమైన సమాధానాలు ఇవ్వగలగాలి. అలాంటి సమాధానం కోరుతూ ఆ ప్రశ్నలను ఎవరైనా ముందుకు తెస్తే ''మా విశ్వాసాలను అవమానిస్తున్నారు'' అంటూ కోర్టు కెళ్తారు. అవి కూడా సైన్సులో భాగాలేనని అనకుండా కేవలం విశ్వాసాలుగా మాత్రమే వారు చెప్పుకుంటే అలా కోర్టుకు వెళ్లే హక్కు కొంతవరకు ఉంటుందనుకోవచ్చు. కానీ, 'మెలి తిరిగి ఉన్నా నాదే' అన్నట్టుగా, మాది విశ్వాసమూ, సైన్సూ కూడా నని చెబుతూ రెండింటా గెలవాలనుకోవడం సరికాదు.
(సమాధానం చెప్పిన వారు ... ప్రొఫెసర్ రామచంద్రయ్య, ఎడిటర్, చెకుముకి, జనవిజ్ఞాన వేదిక)

1 comment:

  1. Then what about birth, life, death and soul; what is prior to the big bang and tell me about whole thing is run by power. so what is the power

    ReplyDelete